
ప్రశాంతంగా ముగిసిన మద్యం టెండర్ల డ్రా
భారీగా తరలొచ్చిన ఔత్సాహికులు
గౌడ, ఎస్సీ, ఎస్టీలకు తొలిసారిగా రిజర్వేషన్లు అమలు
ఖమ్మంలో 122, భద్రాద్రి జిల్లాలో 88 దుకాణాలకు ఎంపిక ప్రక్రియ పూర్తి
ఉమ్మడి జిల్లాలో 33 మంది మహిళలకు దక్కిన దుకాణాలు
వచ్చేనెల 1వ తేదీ నుంచి నూతన ఆబ్కారీ విధానం అమలు
మామిళ్లగూడెం/ కొత్తగూడెం క్రైం, నవంబర్ 20: ఉత్కంఠకు తెరపడింది. లక్కీ డ్రా విజేతలెవరో తేలిపోయింది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 210 మద్యం దుకాణాలకు దాదాపు 10 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ ప్రత్యేక పరిశీలకులు పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ శరత్, ఖమ్మం జిల్లాలో వీపీ గౌతమ్ లాటరీ తీసి మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ సారి 33 మంది మహిళలకు దుకాణాలు దక్కడం విశేషం. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం మండలం రాజుపాలెం దుకాణానికి అత్యధికంగా 121 దరఖాస్తులు వచ్చాయి. వచ్చేనెల 1వ తేదీ నుంచి నూతన ఆబ్కారీ విధానం అమల్లోకి రానున్నది. -మామిళ్లగూడెం, కొత్తగూడెం క్రైం ,నవంబర్ 20
ఉభయ జిల్లాల్లోని 210 మద్యం దుకాణాల కేటాయింపునకు శనివారం జరిగిన లక్కీ డ్రా ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. అధికారులు తీసుకున్న పకడ్బందీ చర్యలతో ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాలోని 122 మద్యం దుకాణాలకు మొత్తం 6,212 దరఖాస్తులు రాగా శనివారం సీక్వెల్ రిసార్ట్స్‌లో కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు డ్రా ప్రక్రియ నిర్వహించారు. లాటరీ తీసి దుకాణాలు కేటాయించారు. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిలో 20 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలోని రాజుపాలెం దుకాణానికి అత్యధికంగా 121 దరఖాస్తులు అందాయి. ముదిగొండ మండలంలోని వల్లభి మద్యం దుకాణానికి 118 దరఖాస్తులు అందాయి. దరఖాస్తులు అందించిన వారిలో ఒకే ఒక్క మహిళ ఉండగా ఆమె పేరే లాటరీలో వచ్చి లక్కు చిక్కింది. ఖమ్మం నగరంలోని 10వ నంబర్ దుకాణానికి అత్యల్పంగా 21 దరఖాస్తులు మాత్రమే దాఖలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న నేలకొండపల్లి, ముదిగొండ, ఎర్రుపాలెం, మధిర, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లోని షాపులు దక్కించుకోవడానికి ఎక్కువ మంది ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపించింది. లాటరీ ప్రక్రియను పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు, ఈఎస్ సోమిరెడ్డి పర్యవేక్షించారు. లాటరీ ప్రక్రియను సాంతం కెమెరాలో బంధించారు. డ్రా వేదికల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
డ్రా కేంద్రాల వద్ద రద్దీ..
డ్రా కేంద్రాల వద్ద ఉదయం 9 గంటల నుంచే రద్దీ కనిపించింది. ఖమ్మం నగరంలోని సిక్వేల్ పరిసర ప్రాంతం, చుంచుపల్లిలోని ఎన్కే నగర్ కమ్మ కల్యాణ మండపం వద్ద జాతర తలపించింది. మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకున్న వారిలో పురుషులతో సమానంగా మహిళలు ఉండడం విశేషం. నూతన మద్యం పాలసీలో భారీ రాయితీలు ప్రకటించడంతో ఏపీ నుంచి కూడా ఎక్కువ మంది వ్యాపారులు పోటీపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాల నుంచి రిజర్వేషన్ల ద్వారా దుకాణాలు పొందిన వారు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. లాటరీలో దుకాణాలకు ఎంపికైన వారు వెంటనే ప్రభుత్వం ప్రకటించిన స్లాట్ రుసుములో 6వ వంతును వెంటనే డీడీ, చలాన్ ద్వారా చెల్లించారు. వ్యాపారుల సౌకర్యార్థం అధికారులు వారికి ప్రత్యేక బ్యాంకు కౌంటర్ ఏర్పాటు చేశారు.