
గ్రామాల అభివృద్ధికి కోసం ఈ పనులను పెద్దఎత్తున నిర్వహించాలి
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్ డాక్టర్ శరత్
కొత్తగూడెం, నవంబర్ 20 : గ్రామాల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్ డాక్టర్ శరత్ అన్నారు. ఉపాధి హామీ పథకం పనులపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఈసీలు, టీఏలతో డీఆర్డీవో సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి పంచాయతీలో రోజుకు 5 నూతన జాబ్ కార్డులు జారీ చేయాలని సూచించారు. ఈ పథకం గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. క్షేత్రస్థాయి నుంచి డీఆర్డీవో, డీపీవో, సీఈవో సమన్వయంతో ఒక టీమ్‌గా పనిచేయాలని సూచించారు. నిరుపేద కుటుంబాలున్న ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి పనులను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న హరితరహారంలో పెద్ద పెద్ద మొక్కలు నాటేందుకు నర్సరీల్లో మొక్కలు పెంపకాన్ని చేపట్టాలన్నారు. లేబర్ బడ్జెట్, మొక్కలు జియో ట్యాగింగ్, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు, అవెన్యూ ప్లాంటేషన్, డంపింగ్ యార్డుల వినియోగం, కల్లాల నిర్మాణం వంటి అంశాల్లో భద్రాద్రి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ప్రశంసించారు. జిల్లాలో 22 బృహత్ పల్లె ప్రకృతి వనాలకు గాను 18 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారని, మిగిలిన నాలుగు వనాలనూ సత్వరం పూర్తి చేయాలని అన్నారు. డీఆర్డీవో మధుసూదన్‌రాజు, జడ్పీ సీఈవో విద్యాలత, డీపీవో రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
లక్ష్మీదేవిపల్లి, నవంబర్ 20: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసుకుంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ సూచించారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయనను శ్రీనగర్ సర్పంచ్ పూనెం శ్రీనివాస్, ఉప సర్పంచ్ లగడపాటి రమేశ్చంద్లు మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందించారు. ప్లాస్టిక్ నివారణ కోసం పంచాయతీలో క్లాత్ బ్యాగులను స్వయంగా కుట్టించి ఇంటింటికీ పంపిణీ చేశామని, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు తమవంతు కృషి చేశామని ఉప సర్పంచ్ వివరించారు.