
జీవితం విలువ తెలుసుకోండి..
చిన్నచిన్న కారణాలకు బలవన్మరణాలు వద్దు
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది..
ఆలోచన విధానంలో మార్పురావాలంటున్న నిపుణులు
సానుకూల దృక్పథంతో జీవితం నిండు నూరేళ్లు
మామిళ్లగూడెం, ఆగస్టు 20;అందమైన జీవితంలో ఆనంద క్షణాలు ఎందుకు కనుమరుగవుతున్నాయి.? ఆర్థిక సమస్యలతో ఒకరు.. కుటుంబ కలహాలతో మరొకరు.. భార్య కాపురానికి రావడం లేదని.. భర్త వేధిస్తున్నాడని, తల్లిదండ్రులు మందలించారని, ప్రేమ విఫలమైందని, ఆకతాయిలు వేధించారని.. కారణమేదైనా క్షణికావేశంతో మృత్యుఒడిని ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఆత్మహత్యలు కలవరానికి గురి చేస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే మృత్యువును ఆశ్రయిస్తున్నారు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. చావే పరిష్కారం కాదు. అందుకే, ఒక్క క్షణం ఆలోచించండి.. జీవితాన్ని ఆస్వాదించండి. కష్టాలను, సమస్యలను మిత్రులతోనో, కుటుంబ సభ్యులతోనో పంచుకోండి. ఆనంద క్షణాలను అనుభవించండి.
అమ్మానాన్నలతో హాయిగా సాగిపోతున్నది జీవితం. డిగ్రీ చదువుతూ స్నేహితులందరికీ తలలో నాలుకలా ఉండేవాడు ఓ యువకుడు. ఇటీవల ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె అంగీకరించలేదు. దానిని జీర్ణించుకోలేకపోయాడు. మనస్తాపం చెందాడు. అమ్మానాన్నలు, స్నేహితులందరినీ మరచిపోయి క్షణికావేశంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇలా అమ్మానాన్నలు మందలించారని, ప్రియురాలు ప్రేమను అంగీకరించలేదని, ఆర్థిక ఇబ్బందులతో చితికిపోతున్నామని, కుటుంబ కలహాలకు తాళలేకపోతున్నామని క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు కొందరు. ఈ నేపథ్యంలో అసలు ఆత్మహత్యకు పురిగొల్పే అంశాలేమిటి? వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? అలాంటి వారిని ముందుగా గుర్తించే అవకాశం ఉంటుందా? అన్న అంశాలను స్పృశిస్తూ ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
అన్ని సందర్భాల్లో ఈ భావోద్రేకాలు ఒకేలా ఉండవు. కొన్ని సంఘర్షణలు ఘర్షణలకు దారి తీస్తాయి. కొందరి మాటలు ఈటెల్లా పొడుచుకుంటాయి. అవమానాలు వేధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ప్రేమ విఫలం, మనస్తాపం.. ఇలా కారణాలేవైనా కావొచ్చు.. మనం అల్లాడిపోతాం. మానసికంగా కుంగిపోతాం. వీటిని ఎదుర్కొంటూ జీవిస్తారు ధైర్యవంతులు. కానీ.. వాటిని కారణంగా చూపి తనువు చాలిస్తున్నారు కొందరు. ఆత్మహత్యే శరణ్యమనుకుని అర్ధాంతరంగా జీవితం నుంచి నిష్క్రమిస్తున్నారు.
వారిని గుర్తించడం ఇలా..
ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు తరచూ ఇదే విషయంపై స్నేహితులు, సన్నిహితులతో చర్చించి ఉంటారని ఓ శాస్త్రీయ అధ్యయనంలో తేలింది. తనకు తాను హాని కలిగించుకోవడం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, ఒత్తిడిలో కుంగిపోవడం, ప్రతి విషయాన్ని ప్రతికూలంగా ఆలోచించడం, నిద్రపోకుండా అలాగే లేచి ఉండడం, చేసే ప్రతి పనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం వంటివి లక్షణాలు. ఇవేకాక క్లినికల్ సైకాలజిస్టుల అధ్యయనం ప్రకారం కొవిడ్ ప్రభావం రెండేళ్ల నుంచి ప్రపంచంపై ఉన్నది. మానవాళిపై ఈ మహమ్మారి తీవ్ర మానసిక ఆర్థిక, సామాజిక ప్రభావాలను కలిగించింది. కరోనా ప్రభావంతో జీవనోపాధులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న వారూ ఉన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకునేవారు, మద్యం తాగే వారు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. మద్యం, డ్రగ్స్ మనిషిలో విచక్షణ కోల్పోయేలా చేస్తాయి. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడేలా పురిగొల్పుతాయి.
యువతే ఎక్కువ..
ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రతి 40 సెకన్లకు ఒక ఆత్మహత్య వెలుగుచూస్తున్నది. వీరిలో ఎక్కువ మంది యువతీ యువకులు కావడం గమనార్హం. గడిచిన మూడేళ్లలో ఖమ్మం జిల్లాలో 903 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ విఫలం వంటి కారణాలతో మృతిచెందిన వారే అధికం.
ప్రతీ సమస్యకూ పరిష్కారం ఉంటుంది..
ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ఆత్మహత్యే సమస్యకు పరిష్కారం కాదు. అందుకే, సమస్యల పరిష్కారానికి ఆలోచన చేయాలి. తమకు నచ్చినవారితో తమ సమస్యలను చెప్పుకుని పరిష్కరించుకునేందుకు యత్నించాలి. ప్రధానంగా కుటుంబ కలహాలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఆర్థిక సమస్యలతో ఎక్కువ మంది క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి పరిష్కారం ఒక్కటే.. ఆత్మహత్యల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఒంటరిగా తిరుగుతున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ చేయాలి. జీవితం విలువను తెలిజేయాలి.
సంభాషణలతో మంచి ఫలితాలు..
ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిని గుర్తిస్తే వారితో మాట్లాడడం అత్యంత ముఖ్యమైన విషయం. దీనికి ‘రీ థింక్’ అనే పద్ధతిని జనబాహుళ్యంలోకి తీసుకువచ్చారు యూకేకు చెందిన ఎమ్మా క్యారింగ్టన్ అనే నిపుణుడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు నిరంతరం ఆ వ్యక్తికి ధైర్యం చెప్పాలి. ఆ వ్యక్తి కళ్లలో కళ్లు పెట్టి స్నేహపూర్వకంగా మాట్లాడాలి. తాను చెప్పే బాధలు వినాలి. ఓపిక వహించాలి. అవును లేదా కాదు అనే సమాధానాలు వచ్చేలా ఎక్కువ ప్రశ్నలు అడగాలి. వాళ్ల సమస్య మీకేం అర్థమైందో చూడాలి. ఆ వ్యక్తి మాట్లాడుతుంటే మధ్యలో అంతరాయం కలిగించొద్దు. వారికి మానసిక నిపుణుల కౌన్సిలింగ్ అవసరమా? లేకా కుటుంబ సభ్యుల సహకారంతో మార్చవచ్చా? అని ఒక నిర్ణయానికి రావాలి. ఆ వ్యక్తి బలాలను తెలియజెప్పాలి. తాను సాధించిన విజయాలను గుర్తుచేయాలి.