బుధవారం 15 జూలై 2020
Khammam - May 30, 2020 , 02:37:11

ఖమ్మం జిల్లాలో 66 నూతన చెక్‌డ్యాంల నిర్మాణం

ఖమ్మం జిల్లాలో 66 నూతన చెక్‌డ్యాంల నిర్మాణం

  • వృథా నీటికిచెక్‌డ్యాం
  • చిన్ననీటిపారుదలకు మహర్దశ 
  • రూ.176.59 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
  • కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ
  • హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు

సాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్‌ వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మించి సాగు నీరు అందిస్తున్నారు. నదులు, కాలువల ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని ఒడిసిపట్టి సాగునీటి రంగానికి వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. అందులో భాగంగానే జిల్లాలో నూతనంగా 66 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.176.59 కోట్లు మంజూరు చేశారు.. అధికారులు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ప్రవహించే చిన్న నదులపై వాటిని నిర్మించేందుకు టెండర్లు పిలిచారు.. టెండర్లు పూర్తయిన వెంటనే పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. దీంతో జిల్లాలో ఆయకట్టు సాగు పెరుగనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.                                           

-ఖమ్మం

ఖమ్మం: వేల కోట్ల రూపాయలను వెచ్చించి  పెద ్దపెద్ద సాగునీటి ప్రాజెక్టులను కడుతున్న ప్రభుత్వం.. చిన్న నీటి పారుదల రంగ అభివృద్ధికి కూడా గట్టిగా కృషి సాగిస్తున్నది. ఇప్పటికే మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువుల అభివృద్ధి పనులను చేపట్టింది. ప్రతి ఏడాది 25 శాతం చెరువుల అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకం ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో, జిల్లాలో చిన్న చిన్న నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలోని నీరు సముద్రంలో వృథాగా కలుస్తున్నది. దీనిని నివారించేందుకు రాష్ట్ర  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కృషితో ఖమ్మం జిల్లాలో 66 చెక్‌డ్యాముల నిర్మాణానికి ప్రభుత్వం రూ.176.59 కోట్లు మంజూరు చేసింది. ఏయే నియోజకవర్గానికి ఎన్నెన్ని మంజూరయ్యాయో వివరంగా తెలుసుకుందాం.

ఖమ్మం నియోజకవర్గంలో నాలుగు..

ఖమ్మం నియోజకవర్గంలోని ఖమ్మం అర్బన్‌లో ఒకటి, రఘునాథపాలెం మండలంలో మూడు చెక్‌డ్యాములు మంజూరయ్యాయి. అర్బన్‌లోని ఖమ్మం నగర పరిధిలోగల మున్నేరు నదిపై ప్రకాశ్‌నగర్‌ బ్రిడ్జి వద్ద చెక్‌డ్యామ్‌ నిర్మించేందుకు ప్రభుత్వం రూ.7కోట్లను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియ ఇటీవలనే పూర్తయింది. పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. రఘునాథపాలెం మండలంలోని కేవీ బంజర గ్రామం వద్ద నిమ్మవాగుపై చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి.  మిగతా వాటికి సాంకేతికపరమైన అనుమతులు రావాల్సుంది.

పాలేరు నియోజకవర్గంలో 10..

పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 10 చెక్‌డ్యాములు మంజూరయ్యాయి. ఖమ్మం రూరల్‌ మండలంలోని తనగంపాడు వద్ద ఆకేరు నదిపై రూ.4.29 కోట్లతో చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. ఊటవాగు తండా వద్ద ఆకేరు నదిపై రూ.4.29 కోట్ల వ్యయంతో చెక్‌డ్యామ్‌ మంజూరైంది. కూసుమంచి మండలంలోని జక్కేపల్లి వద్ద పాలేరు నదిపై రూ.5 కోట్లతో, రాజుపేట వద్ద పాలేరు నదిపై రూ. 4.73 కోట్లతో, నేలకొండపల్లి మండలంలోని బుద్దారం గ్రామం వద్ద పాలేరు నదిపై రూ.4.24 కోట్లతో, చెన్నారం గ్రామం వద్ద పాలేరు నదిపై రూ.3.92 కోట్లతో, పైనంపల్లి గ్రామం వద్ద పాలేరు నదిపై రూ.4.46 కోట్లతో, రామచంద్రాపురం గ్రామం వద్ద పాలేరు నదిపై రూ.4.48 కోట్లతో, సదాశివపురం గ్రామం వద్ద శంకర్‌గిరి వాగుపై రూ.1.84 కోట్లతో, తిరుమలాయపాలెం మండలంలోని ముజాహిద్‌పురం వద్ద పాలేరు నదిపై రూ.5 కోట్లతో చెక్‌డ్యాములు మంజూరయ్యాయి.

మధిర నియోజకవర్గంలో 11..

మధిర నియోజకవర్గంలో 11 చెక్‌డ్యాముల నిర్మాణానికి ప్రభుత్వం రూ.63.78 కోట్లు మంజూరు చేసింది. మధిర మండలంలోని చిలుకూరు గ్రామం వద్ద వైరా మున్నేరుపై రూ.4.81కోట్లతో, మధిర వద్ద వైరా మున్నేరుపై రూ.7.36 కోట్లతో, సిరిపురం గ్రామం వద్ద వైరా నదిపై రూ.4.31 కోట్లతో, తుర్లపాడు గ్రామం వద్ద కట్టలేరు నదిపై రూ.4.55 కోట్లతో, ముదిగొండ మండలంలోని ముత్తారం గ్రామం వద్ద మున్నేరు నదిపై రూ. 9.70 కోట్లతో, వల్లాపురం గ్రామం వద్ద మున్నేరుపై రూ.10.48 కోట్లతో, పండ్రేగుపల్లి గ్రామం వద్ద మున్నేరుపై రూ.5.64 కోట్లతో, ఎర్రుపాలెం మండలంలోని పెగళ్లపాడు వద్ద కట్టలేరుపై రూ.4.55 కోట్లతో, శంకినివీడు వద్ద కట్టలేరుపై రూ.4.12 కోట్లతో, బోనకల్‌ మండలంలోని రేపల్లె గ్రామం వద్ద వైరా మున్నేరుపై రూ.4.12 కోట్లతో, రాయన్నపేట గ్రామం వద్ద వైరా మున్నేరుపై రూ.4.11 కోట్లతో చెక్‌డ్యాములు మంజూరయ్యాయి. వీటిలో ఐదింటికి టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వాటికి సాంకేతికపరమైన అనుమతులు రావాల్సి ఉంది.

వైరా నియోజకవర్గంలో తొమ్మిది..

వైరా నియోజకవర్గంలోని వైరా, ఏన్కూరు, సింగరేణి, కామేపల్లి మండలాల్లో తొమ్మిది చెక్‌డ్యాముల నిర్మాణానికి రూ.16.26 కోట్లు మంజూరయ్యాయి. వైరా మున్నేరుపై గరికపాడు వద్ద రూ.4.39 కోట్లతో, పుణ్యపురం వద్ద గంగదేవిపాడు వాగుపై రూ.2.63 కోట్లతో, ఏన్కూరు మండలంలోని నాచారం వద్ద పెద్దవాగుపై రూ.94.80 లక్షలతో, రంగాపురం వద్ద మొద్దుపడవ వాగుపై రూ.99.70 లక్షలతో, సింగరేణి మండలంలోని రొట్టమాకిరేవు వద్ద బుగ్గవాగుపై రూ.1.36 కోట్లతో, గేట్‌కారేపల్లి వద్ద బుగ్గవాగుపై రూ.1.39 కోట్లతో, రామచంద్రాపురం వద్ద బుగ్గవాగుపై రూ.1.27 కోట్లతో, కామేపల్లి మండలంలోని బండిపాడు వద్ద బుగ్గవాగుపై రూ.1.82 కోట్లతో, పొన్నెకల్లు వద్ద బుగ్గవాగుపై రూ.1.45 కోట్లతో చెక్‌డ్యాములు మంజూరయ్యాయి. 

సత్తుపల్లి నియోజకవర్గంలో 15..

సత్తుపల్లి నియోజకవర్గంలోని 15 చెక్‌డ్యాముల నిర్మాణానికి రూ.45.87 కోట్లు మంజూరయ్యాయి. తల్లాడ మండలంలోని కుర్నవల్లి వద్ద కట్టలేరుపై రూ.7.40 కోట్లతో, పెద్దవాగుపై రూ.1.93 కోట్లతో, అంజనాపురం, రేజర్ల గ్రామాల వద్ద పెద్దవాగుపై రూ.2.77 కోట్లతో, రంగం బంజర వద్ద నల్లజల్ల వాగుపై రూ. 2.35 కోట్లతో, మిట్టపల్లి వద్ద కట్టలేరుపై రూ.3.80 కోట్లతో, కిష్టారం  వద్ద కట్టలేరుపై రూ.6.72 కోట్లతో, కలకొడిమ వద్ద పెద్దవాగుపై రూ.2.45 కోట్లతో, పినపాక వద్ద కట్టలేరుపై రూ.3.20 కోట్లతో, వేంసూరు మండలంలోని అడసర్లపాడు వద్ద కట్టలేరుపై రూ.2.80 కోట్లతో, రామన్నపాలెం వద్ద కట్టలేరుపై రూ.2.57 కోట్లతో, పెనుబల్లి మండలంలోని మండాలపాడు వద్ద లోతువాగుపై రూ.1.40 కోట్లతో, కల్లూరు మండలంలోని యజ్ఞ నారాయణపురం వద్ద పెద్దవాగుపై రూ. 2.80 కోట్లతో, పేరువంచ వద్ద కట్టవారి వాగుపై రూ.2.25 కోట్లతో, పుల్లయ్య బంజర వద్ద పెద్దవాగుపై రూ.1.84 కోట్లతో, వెంకటాపురం వద్ద వాగుపై రూ.1.60 కోట్లతో చెక్‌డ్యాముల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

త్వరలోనే పనులు చేపడతాం..

ఖమ్మం జిల్లాకు 66 చెక్‌డ్యాములు మంజూరయ్యాయి. 47 చెక్‌డ్యాములకు అంచనాలు పూర్తయ్యాయి. 19 చెక్‌డ్యాములకు సాంకేతికపరమైన అనుమతులు వచ్చాయి. వీటిలో 18కి టెండర్లను పిలవగా 14 ఖరారయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్లు పూర్తయిన చోట పనులను త్వరలోనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

- ఎస్‌.నరసింహారావు, ఈఈ, చిన్న నీటిపారుదల శాఖచిన్ననీటిపారుదలకు మహర్దశ 





logo