సోమవారం 06 ఏప్రిల్ 2020
Khammam - Jan 28, 2020 , 00:06:58

కటకటాల్లోకి కీచకులు..

కటకటాల్లోకి కీచకులు..

రఘునాథపాలెం: మహిళను ఇంటి నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఏడుగురు గ్యాంగ్‌ను రఘునాథపాలెం పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. సోమవారం రఘునాథపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ గ్యాంగ్‌ రేప్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈనెల 24 మండలానికి చెందిన 36ఏండ్ల గిరిజన మహిళ తన భర్తతో కలిసి నిద్రిస్తుండగా హర్యాతండాకు చెందిన అజ్మీరా నాగేశ్వరరావు, సుకినీతండాకు చెందిన భుక్యా సునీల్‌లు ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా ఎత్తుకుని ద్విచక్ర వాహనంపై ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం గ్రామ శివారు పత్తి చేలోకి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాగా అప్పటికే అక్కడ హర్యాతండాకు చెందిన బానోతు ఉపేందర్‌, ఆంగోతు కల్యాణ్‌, బానోతు మోహన్‌, బానోతు చంటి, సుకినీతండాకు చెందిన మాలోతు అశోక్‌లు ఉన్నట్లు తెలిపారు. పత్తి చేలోకి తీసుకొచ్చిన మహిళను ఒకరి తరువాత ఒకరు సామూహిక అత్యాచారం చేసే ప్రయత్నంలో అదే సమయంలో ఆ ప్రాంతమీదుగా పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న ఎస్‌ఐ సంతోష్‌ కారు సైరన్‌ చేయడంతో నిందితులు సదరు మహిళను సంఘటనా స్థలం వద్దనే వదిలి పారిపోయినట్లు తెలిపారు. వెంటనే తప్పించుకున్న బాధిత మహిళ జరిగిన విషయాన్ని తన భర్తకు తెలియజేసి అదే రోజు అర్ధరాత్రి రఘునాథపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మహిళపై జరిగిన లైంగిక దాడిని సవాల్‌గా తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఏడుగురు యువకుల కోసం వెతుకులాట చేయగా, మంగళవారం ఉదయం ఖమ్మం నగర పరిధి కైకొండాయిగూడెం క్రాస్‌ రోడ్డు మీదుగా వెళ్తుండగా ఖమ్మం రూరల్‌ సీఐ సత్యనారాయణరెడ్డి సిబ్బందితో దాడి చేసి ఏడుగురిని అరెస్ట్‌ చేయడం జరిగిందన్నారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి ఆరు సెల్‌ఫోన్లు, అత్యాచార సంఘటన జరిగిన ప్రదేశంలో యువకులు వదిలి వెళ్లిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనపర్చుకోవడం జరిగిందన్నారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన పై ఏడుగురు నిందితులపై ఐపీసీ 452, 363, 376డి సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసును ఫాస్ట్రాక్‌ కోర్టు ద్వారా ముద్దాయిలకు త్వరితగతిన శిక్ష పడేందుకు కృషి చేస్తామని సీపీ బాధిత మహిళ కుటుంబానికి హామీ ఇచ్చారు. మహిళపై దాడి సమయంలో చాకచక్యంగా వ్యవహరించి సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ సంతోష్‌ను సీపీ అభినందించారు. ఈ సమావేశంలో రూరల్‌ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, ఏఎస్‌ఐ డీ.వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.


logo