శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Jan 27, 2020 ,

నేడు మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

నేడు మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • సీఎం కేసీఆర్‌ పంపే సీల్డ్‌ కవర్లలో పేర్లు
  • ఉదయం 11గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న కౌన్సిలర్లు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగించింది.. ప్రతిపక్షాలకు మనుగడ లేకుండా చేసింది.. సత్తుపల్లిలో క్లీన్‌స్విప్‌ కావడం.. వైరా, మధిరలో అత్యధిక స్థానాలు గెలుపొందడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక లాంఛనమే కానుంది.. అయితే పార్టీలో అనుభవం, పార్టీ పట్ల విధేయత ఉన్న వారిని నియమించడం జరుగుతుందని గతంలో కేసీఆర్‌ ప్రకటించారు. సోమవారం ఉదయం సీఎం కేసీఆర్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల పేర్లను సీల్డ్‌కవర్లల్లో ఆయా నియోజకవర్గ శాసనసభ్యులకు పంపించనున్నారు. సీఎం సూచించిన వ్యక్తులనే గెలిచిన కౌన్సిలర్లు చైర్మన్లుగా ఎన్నుకోనున్నారు. జిల్లా కలెక్టర్‌ సోమవారం జరిగే కౌన్సిల్‌ సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానం పంపించారు. ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలలోని మున్సిపల్‌ కార్యాలయాల్లో నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.    

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ వ్యాప్తం గా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయ ఢంకా మోగించిన సంగతి తెల్సిందే...ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మధిర, కొత్తగూడెం, ఇల్లెందు మున్సి పాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సోమవారం మున్సిపాలిటీలలో నూతన పాలకవర్గం బాధ్యతలను తీసుకోనుంది. దీని కోసం మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అయితే నూతనంగా ఎన్నికైన పాలకవర్గంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ఎవరిని నియమిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కాగా మున్సి పాలిటీ ఎన్నికల్లో వార్డు సభ్యులను ఎంపిక చేసే బాధ్యత ఆయా నియోజకవర్గ శాసన సభ్యులకే పార్టీ అప్పగించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు మున్సిపాలిటీలలో అన్ని రకాలుగా బలమున్న అభ్యర్థులను శాసనసభ్యులు పోటీలో ఉంచి గెలిపించారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక మాత్రం పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచించిన వారినే ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్‌ భావించారు. పార్టీలో అనుభవం, పార్టీ పట్ల విధేయేత ఉన్న వ్యక్తులనే నియమించడం జరుగుతుందని గతంలో కేసీఆర్‌ ప్రకటించారు. దీని ప్రకారం సోమవారం ఉదయం సీఎం కేసీఆర్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల పేర్లను సీల్డ్‌కవర్లల్లో ఆయా నియోజకవర్గ శాసనసభ్యులకు పంపించను న్నారు. సీఎం సూచించిన వ్యక్తులనే గెలిచిన కౌన్సిలర్లు చైర్మన్‌లుగా ఎన్నుకోనున్నారు. 

నేడు చైర్మన్ల ఎన్నిక...

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో ఎన్నికైన కౌన్సిలర్లకు ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్‌లు సోమవారం జరిగే కౌన్సిల్‌ సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానం పంపించారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలలోని మున్సిపల్‌ కార్యాలయాలలో నూతనంగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ తంతు ముగిశాక మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్లను ఎన్నుకుంటారు. ఆ తరువాత వైస్‌ చైర్మన్లను ఎన్నుకోవడం జరుగుతుంది. మొత్తం ఎన్నికైన సభ్యుల్లో కోరం ఉంటేనే వీరిని ఎన్నుకుంటారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు ఒకే నామినేషన్‌ వస్తే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒక వేళ ఒకటి కంటే అధికంగా నామినేషన్లు వస్తే ఓటింగ్‌ అధి కూడా చేతులెత్తే విధానం ద్వారా ఎన్నుకుంటారు. అయితే ఉమ్మడి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్‌ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుపొందినందున ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం లేదు. దీని వలన చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే అవకాశం ఉంది. మున్సిపల్‌ పాలకవర్గంలో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా స్థానిక శాసనస భ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, శాసనమండలి సభ్యులుంటారు. కోరంను నిర్ణయించే సందర్భంలో వీరిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. 

 ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు టీఆర్‌ఎస్‌వే... 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు కూడా ఆ పార్టీకి చెందిన వారే ఎంపిక కావడం లాంఛన ప్రాయంగా జరగనుంది. సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన అభ్యర్థులకే గెలుపొందిన అభ్యర్థులు మద్దతు ఇవ్వనున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను మొత్తం వార్డులను టీఆర్‌ఎస్‌ గెలుసుకుంది. మధిరలోని 22 వార్డులకుగాను 13 వార్డులను, వైరాలోని 20 వార్డులకు 15 వార్డులను, కొత్తగూడెంలో 36 వార్డులకుగాను 25 వార్డులను, ఇల్లందులోని 24 వార్డులకుగాను 19 వార్డులను టీఆర్‌ఎస్‌ గెలవడం జరిగింది. ఈ మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన ఇద్దరు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ సంఖ్య 21 కు చేరింది. కనుక అన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారుకావడం లాంచన ప్రాయమే.   


logo