ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 25: భర్తతో గొడవపడి పిల్లలతో సహా ఒక గృహిణి ఇంటి నుంచి(Disappear) వెళ్లిపోయిన ఘటన వారాసిగూడ(Varasiguda) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామ్నగర్ గుండు ప్రాంతంలో అడిక్మేట్ బాలాజీ నగర్లో నివాసముండే నర్సింహ వృత్తిరీత్యా న్యాయవాది. అతడు రాజలక్ష్మి (32)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి లక్ష్మీ నక్షత్ర (6), సూర్య సిద్ధార్థ్ (5) ఇద్దరు సంతానం. ఈ నెల 13వ తేదీన భార్యాభర్తలు ఇద్దరూ గొడవపడ్డారు.
ఆ తరువాత రాజలక్ష్మి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. తెలిసిన వాళ్ల దగ్గరకు వెళ్లి ఉంటుందని భావించిన నర్సింహ తెల్లవారి తిరిగివస్తుందని అనుకున్నారు. తెల్లవారి ఫోన్ చేయగా, రాజలక్ష్మి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో షాక్కు గురై సన్నిహితుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకుండాపోయింది.
16వ తేదీన నర్సింహ తండ్రి అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని రాజలక్ష్మికి చేరవేసేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఫలితంలేకపోవడంతో, స్వగ్రామమైన నల్గొండలో తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. తదనంతర కార్యక్రమాల నేపథ్యంలో స్వగ్రామం నుంచి రాలేని పరిస్థితుల దృష్ట్యా ఫిర్యాదును వాట్సప్, మెయిల్ ద్వారా పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.