ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 27: అర్హత సాధించి ఉద్యోగాలకు దూరమైన డీఎస్సీ-2008 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఈనెల 30వ తేదీన చేపట్టనున్నారు. వీరిని కాంట్రాక్టు పద్ధతిలో ఎస్జీటీలుగా నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో డీఎస్సీ-2008 రాసి 70:30 నిష్పత్తిలో రిజర్వేషన్ వల్ల ప్రభావితమైన బీఈడీ అభ్యర్థులను గుర్తించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆ జాబితాను జిల్లాలకు ఈ నెల 26వ తేదీన పంపించారు. వివరాలను వెబ్సైట్లో పొందుపర్చడంతోపాటు అభ్యర్థులకు సమాచారం ఇస్తూ.. ప్రత్యేకంగా రూపొందించిన నమూనాను పూర్తి చేసి.. దానిని సర్టిఫికెట్ల పరిశీలన రోజు అందజేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ-2008 నిర్వహించిన సందర్భంగా సర్టిఫికెట్ల పరిశీలన చేసి ఒకటి, రెండు రోజుల్లో ఉద్యోగాల్లో చేరేందుకు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా.. ఆ సమయంలో 30 శాతం పోస్టులను ప్రత్యేకంగా డీఈడీ చేసిన వారికి కేటాయించారు. దీంతో బీఈడీ చేసిన వారు మార్కుల పరంగా ముందున్నప్పటికీ నష్టపోయారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని పోరాటం చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వం వీరికి సంబంధించిన తుది జాబితాను వెలువరించి ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదిలోపు ధ్రువపత్రాల పరిశీలన చేయాలని సూచించింది. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండు రోజులపాటు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తుండగా.. ఖమ్మంలో మాత్రం ఒక్కరోజులోనే పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఈ నెల 30న ఖమ్మంలోని పాత డీఈవో కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. డీఎస్సీ-2008లో మైదాన ప్రాంతంలో 128 మంది, ఏజెన్సీలో 215 మంది అభ్యర్థులున్నారు. వీరు.. 1 నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పీహెచ్సీ వీహెచ్/ హెచ్‌హెచ్/ ఓహెచ్ సర్టిఫికెట్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డు, పాస్‌పోర్టు ఫొటోలతో హాజరుకావాలి. విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచిన ప్రత్యేక ధ్రువీకరణ పత్రం డౌన్లోడ్ చేసుకొని దానిని పూర్తి చేసి గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించి సమర్పించాలి.