
అన్నదాతల ఉద్యమానికి దిగొచ్చిన కేంద్రం
వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయంపై సర్వత్రా హర్షం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కర్షకుల సంబురాలు
స్వీట్లు పంచి, పటాకులు కాల్చిన టీఆర్ఎస్, వామపక్షాల నేతలు
కేంద్రమే వడ్లు కొనాలని డిమాండ్
లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్న మంత్రి అజయ్, ఎంపీ నామా
ఖమ్మం, నవబంర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు చేసిన అలుపెరుగని పోరాటానికి ఫలితం దక్కింది.. గతేడాది కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. రైతుల మేలు కోసమేనని బీజేపీ సమర్థించుకున్నా.. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. మోదీ సర్కారు దిగిరాకపోవడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. రైతుల పోరాటాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం కర్షకులపై లాఠీన్యం ప్రదర్శించినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. ఆందోళనలు, ధర్నాలు ఉధృతం చేశారు. సాగు చట్టాలను ఉపసంహరించుకునే వరకూ విశ్రమించేది లేదని కర్షకులు దీక్షాపథంలో పయనించారు. ఎట్టకేలకు అన్నదాతల ఉద్యమానికి కేంద్రం తలొగ్గింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని కార్తీక పౌర్ణమి రోజు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటన చేయడంతో రైతన్నలు సంబురాల్లో మునిగితేలుతున్నారు. స్వీట్లు పంచుకొని, పటాకులు కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించిన రోజు రైతు ఉద్యమం గెలిచిన రోజు. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రోజు. మట్టిని నమ్ముకొని బతుకుతున్న రైతన్న గల్లా ఎగరేసిన రోజు. కార్పొరేట్ శక్తులకు ముచ్చెమటలు పట్టించిన రోజు. దుక్కులు దున్నే రైతన్న బలమేమిటో ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. పార్లమెంట్ సాక్షిగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తానే స్వయంగా వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పూర్తిగా రైతుల విజయం. ప్రధాని ప్రకటనతో యావత్ దేశంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు అండగా టీఆర్ఎస్..
బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను టీఆర్ఎస్ వ్యతిరేకించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రధానికి లేఖ రాశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి నిరసన గళాన్ని వినిపించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బంద్‌లో రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఖమ్మంలో నిర్వహించిన రాస్తారోకోలో మంత్రి అజయ్, ఎంపీ నామా ఎడ్లబండిపై వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలిచారు.
పోరాటాలు సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య
వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఏడాది నుంచి ఢిల్లీలో ఉద్యమాలు చేశారు. కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం రైతుల విజయం. వారికి శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు బాసటగా ఉద్యమం చేస్తానని గర్జించడంతో కేంద్రం దిగి వచ్చి చట్టాలను రద్దు చేసింది. ఆయన పోరాటపటిమకు ఇదే నిదర్శనం. తెగించి కొట్లాడే తెగువ ఉన్న ఉద్యమ సారథి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మెడలు వంచడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇదే నేడు అక్షరాల నిజమైంది. అవసరమైతే దేశంలో రైతుల పక్షాన పోరాటానికి నాయకత్వం చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతోనే పీఎం మోదీ చట్టాలను రద్దు చేశారు. వ్యవసాయరంగంలో సమూల మార్పులు తెచ్చి యువతను ఈ రంగం వైపు, వ్యవసాయం వైపు మళ్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తాపత్రయపడతారు. ఇదే స్ఫూర్తితో సాగును రాష్ట్రంలో పండుగ చేశారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందే. ప్రధాని మోదీ స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను పరిషరించాలి. వడ్లు కొనేవరకూ టీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుంది. రైతుల కష్టాన్ని చూస్తూ ఊరుకోం.
నల్ల చట్టాల రద్దు హర్షణీయం
ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 19 : కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం హర్షణీయమని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారని, ఈ ప్రకటనపై కోట్లాది మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. నల్ల చట్టాల రద్దు కోసం రైతుబంధు సమితి సభ్యులు పోరాటాలు చేసిందన్నారు. జిల్లా నుంచి ఢిల్లీ సమీపంలో జరిగిన రైతుల ధర్నా వద్దకు వెళ్లిందన్నారు. ఉద్యమనాయకుడు రాకేశ్ టికాయత్‌కు సంపూర్ణ మద్దతు పలికిందన్నారు. కేంద్రం విద్యుత్ సవరణ బిల్లులనూ ఉప సంహరించుకోవాలని రైతుబంధు సమితి డిమాండ్ చేస్తున్నదన్నారు.
-రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు
నల్లచట్టాల రద్దు ఘనత రైతులదే
సత్తుపల్లి, నవంబర్ 19: నల్ల చట్టాల రద్దు ఘనత రైతులదేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రైతులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఢిల్లీ సమీపంలో ఉద్యమం చేపట్టారన్నారు. వారి ఉద్యమంతోనే కేంద్రం దిగి వచ్చిందన్నారు. కేంద్రం ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉందన్నారు. రైతులను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, కేసులు మోపినా వెరవకుండా నిరసన చేపట్టారన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని నిలబెట్టుకోవడానికి రైతులే ఉద్యమకారులయ్యారన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాకు దిగి రైతుల ఉద్యమాలను ముందుండి నడిపిస్తానని చెప్పడంతో కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కొంటామని కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుకు వ్యతిరేకంగా వెళ్లిన ఏ ప్రభుత్వమూ దేశంలో నిలబడిన సందర్భాలు లేవన్నారు. రైతు ప్రాధాన్యతను గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
కేంద్రం ఆటలు సాగవు..
కేంద్రం ఆటలు సాగవు. రైతుల జోలికి వస్తే ఊరుకోం. టీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుంది. సీఎం కేసీఆర్ పిలుపుతో హైదరాబాద్‌లో ధర్నా చేశాం. మా ధర్నా సెగ ఢిల్లీకి తగిలింది. ధర్నాతో ప్రధాని మోదీ దిగి వచ్చారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు. యాసంగి వడ్లు కొనకపోతే మున్ముందు రైతులతో కలిసి మరిన్ని ఉద్యమాలు చేపడతాం.