
ఊరూరా సంక్షేమ పథకాలపై అవగాహన
నిరుపేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
ప్రజల గుండెల్లో నిలిచిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే సండ్ర
300 కార్లతో భారీ ర్యాలీ
సత్తుపల్లి, ఆగస్టు 19:గులాబీ దండు కదిలింది.. పల్లెల్లో తెలంగాణ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్షేత్రంలోకి దిగింది.. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, దళిత బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తోంది. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ప్రజా సంక్షేమ యాత్రకు శ్రీకారం చుట్టారు. సత్తుపల్లి శివారు నుంచి 300 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ, అంగన్వాడీలకు వేతనాల పెంపును హర్షిస్తూ బేతుపల్లిలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి పూల, క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ ఉచిత విద్యుత్, రైతుబీమా, రైతుబంధుతో తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దారన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళిత బంధు’ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పేదింట్లో పెద్దన్నగా నిలిచారని కొనియాడారు.
‘టీఆర్ఎస్ అంటే రైతుబంధు.. టీఆర్ఎస్ అంటే రైతుబీమా.. టీఆర్ఎస్ అంటే ఉచిత విద్యుత్.. టీఆర్ఎస్ అంటే దళితబంధు..’ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమయాత్రను గురువారం ప్రారంభించారు. తొలుత సత్తుపల్లి శివారు నుంచి 300 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. రామానగరం, బేతుపల్లి, సిద్దారం, తుమ్మూరు గ్రామాల్లో పర్యటించి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజల మౌలిక అవసరాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయని పథకాలను అందిస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. దళితబంధు పథకం చేపట్టి ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున చేయూతనందిస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ త్వరలోనే ఆసరా పింఛన్లు మంజూరు కానున్నాయన్నారు.
అంగన్వాడీలకు వేతనాలు పెంచిన ఘనత కూడా కేసీఆర్‌దేనన్నారు. తొలుత రామానగరంలో 57 ఏళ్లకే పింఛన్ మంజూరు పట్ల గ్రామస్తుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పుష్పాభిషేకం చేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ మస్తాన్‌వలీ గ్రామాభివృద్ధి కోసం రూ.50 వేల చెక్కును ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం బేతుపల్లిలోనూ రైతు రుణమాఫీని హర్షిస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. అనంతరం సిద్ధారంలో ప్రజా సంక్షేమ యాత్రకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ కొనసాగుతుందన్నారు. ఎంపీపీ దొడ్డా హైమావతీ శంకర్రావు, మున్సిపల్ చైర్మన్ పూసంపుడి మహేష్, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపుడి రామారావు, రైతుబంధు సమితి కన్వీనర్ గాదే సత్యం, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణ, నాయకులు మట్టా ప్రసాద్, మోరంపుడి బ్రదర్స్, పవన్, చాంద్‌పాషా, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.