
రాష్ట్రస్థాయి మహిళా క్రికెట్ జట్టుకు ఎంపిక
దాతలు చేయూతనిస్తే అంతర్జాతీయ జట్టులో చోటు సాధిస్తామని ధీమా
ఖమ్మం రూరల్, ఆగస్టు 19 ;ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు ఈ బాలికలు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఆటలో సత్తాచాటి నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మైదానంలో పరుగుల వరద పారిస్తూ.. చదువుల్లో మార్కుల పంట పండిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి.. జాతీయస్థాయికి ఎదిగారు. చేయూతనిస్తే అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఖమ్మం జిల్లా కీర్తి పతాక ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 4,5,6వ తేదీల్లో జమ్మూకశ్మీర్‌లో జరిగే జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొననున్న ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా గ్రామానికి చెందిన హలావత్ పూజిత, బోడా దివ్యశ్రీ, రితూ కుమారిపై ’నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా గ్రామంలో హలావత్ పూజిత కుటంబం నివాసముంటున్నది. ఆమె తండ్రి మల్లికార్జున్ ఖమ్మం నగరంలోని బార్ అండ్ రెస్టారెంట్లో సైప్లెయర్గా, తల్లి భారతి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం పూజిత, అర్చన.. ఆడ పిల్లలయినా నిరాశ చెందకుండా చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె పూజిత (14) జలగం నగర్‌లోని జడ్పీఎస్ఎస్ 10వ తరగతి చదువుతోంది. చిన్ననాటి నుంచే చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించడంతో ఉపాధ్యాయులు, పీఈటీ ప్రోత్సాహంతో క్రికెట్ సాధన ప్రారంభించింది. మూడో తరగతి నుంచే క్రికెట్ అంటే మక్కువ పెంచుకున్న ఆమె పటేల్ స్టేడియంలో ప్రత్యేక సాధన చేస్తున్నది. పాఠశాలస్థాయి నుంచే మండల, జిల్లా, రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టులో ప్రతిభను కనబర్చి సెలెక్టర్ల మన్ననలు పొందింది. పూజితలోని నాయకత్వ లక్షణాలు, ఆట తీరును పరిశీలించిన సెలెక్టర్లు ఆమెను జట్టు కెప్టెన్‌గా చేశారు. భారత జట్టులో స్థానం సంపాదించి అంతర్జాతీయ క్రికెటర్‌గా రాణించాలని ఉందని పూజిత పేర్కొంటున్నది.
‘దివ్య’మైన బ్యాటింగ్ ఆమె సొంతం..
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా గ్రామంలో బోడా దివ్యశ్రీ నివాసముంటున్నది. తండ్రి బోడా రవి నిమ్మకాయల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తల్లి చంద్రావతి వ్యవసాయ కూలీ. వీరికి ముగ్గురు సంతానం ఇద్దరు ఆడపిల్లల్లో దివ్యశ్రీ, నవ్యశ్రీతోపాటు కుమారుడు సిద్దునాయక్ ఉన్నారు. దివ్య శ్రీ జలగం నగర్‌లోని జడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నది. పరీక్షల్లో 9.5 గ్రేడ్‌పాయింట్లు సాధించింది. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. క్రీడలపై ఆసక్తి చూపడంతో అధ్యాపకులు, పీఈటీ, తల్లిదండ్రులు ఆమెను ఆ దిశగా ప్రోత్సహించారు. రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్నది. ఆమె బ్యాటింగ్ శైలికి సెలెక్టర్లు ఫిదా అయ్యారు. మైదానంలోకి దిగితే పరుగుల వర్షం కురిపించే దివ్యశ్రీజాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైంది. దాతలు సహకరిస్తే అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన క్రికెట్ కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకొని భారత జట్టు తరఫున ఆడాలని ఆకాంక్ష ఉందని పేర్కొంది దివ్యశ్రీ.
తండ్రిది పానీపూరి బండి.. కూతరు క్రికెట్లో ఆల్ రౌండర్
రూరల్ మండలం జలగంనగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న రితూ కుమారిది పేద కుటుంబం. 20 ఏండ్ల క్రితం జీవనోపాధి కోసం ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ ప్రాంతానికి వలసొచ్చారు. రితూ కుమారి తల్లి శీలాదేవి, తండ్రి సుగర్సింగ్ పానీపూరి బండితో జీవనోపాధి పొందుతున్నారు. రీతూకు ఇద్దరు సోదరులు ఉన్నారు. రెండో సంతానంగా పుట్టిన రితూ కుమారి చిన్ననాటి నుంచే చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నది. 10వ తరగతి వరకు జలగం నగర్ జడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించింది. ప్రస్తుతం ఎన్ఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నది. రీతూ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా ప్రతిభను కనబరుస్తున్నది. మైదానంలో ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తాచాటుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూనే సివిల్స్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని, ఐపీఎస్ సాధించి ప్రజాసేవ చేస్తానని తెలిపింది రీతూ..
ముగ్గురు ముగ్గురే..
వీరు ముగ్గురూ ఇప్పటివరకు జాతీయస్థాయిలో జరిగిన క్రికెట్ పోటీల్లో ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గోవా, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరుఫున అండర్ 19 సీనియర్ మహిళా విభాగంలో ఆడారు.
దాతలు చేయూతనిస్తే..
దాతలు చేయూతనందిస్తే అంతర్జాతీయ క్రికెట్ జట్టులో చోటు సాధిస్తామని ఈ క్రీడామణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి ముగ్గురూ పేదవర్గాలకు చెందినవారే. వారి ప్రతిభకు పదునుపెట్టేందుకు జాతీయ అకాడమీలో చేరేందుకు పేదరికం అడ్డు వస్తున్నది. అందుబాటులో ఉన్న సర్దార్‌పటేల్ స్టేడియాన్ని ఎంచుకుని సాధన చేస్తున్నారు. ఈ క్రీడామణులకు దాతలు ఆర్థిక చేయూత అందిస్తే అంతర్జాతీయ వేదికపై జిల్లా, రాష్ర్టానికి పేరు ప్రఖ్యాతులు తేవడంతోపాటు ప్రతిభావంతమైన క్రీడాకారులుగా రాణిస్తారు.