
రామయ్యకు ప్రత్యేక స్నపనం
కొనసాగుతున్న పవిత్రోత్సవాలు
జమలాపురంలోనూ వేడుకలు
భద్రాచలం, ఆగస్టు 19: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రావణమాసోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వార్షిక పవిత్రోత్సవాల్లో గురువారం రామయ్య స్వామికి పవిత్రారోపణం నిర్వహించారు. సంవత్సరంలో జరిగిన పూజాధికాల్లో ఏవైనా లోపాలుంటే.. అవన్నీ ఈ పవిత్రోత్సవాల ద్వారా తొలిగిపోతాయని ఆగమ శాస్త్రం చెబుతోంది. అందుకని ఈ పవిత్రోత్సవాలను భక్తరామదాసు కాలం నుంచి నిర్వహిస్తున్నారు. ఉదయం బేడా మండపంలో ఉత్సవ పెరుమాళ్లు (స్వర్ణమూర్తులు)ను వేంచేయింప చేసి ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణః పుణ్యాఃవచనం, వేద విన్నపాలు చేశారు. అనంతరం 108 వెండి కలశాలతో అష్టోత్తర శత కలశాభిషేకం, సహస్రధారలతో ప్రత్యేక స్నపనం గావించారు. 12 మంది వేద పండితులు పంచోపనిషత్ మంత్రాలు పఠించారు. ఆచార్యబ్రహ్మ రుత్విక్లు, ఉభయ వేదాంత ప్రవక్తులు, ఆలయ ఉప ప్రధానార్చకులు కోటి రామస్వరూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
నేడు అమ్మ వారికి ప్రత్యేక పూజలు
భద్రాచలం రామాలయంలో శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలతో, పళ్ల రసాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కుంకుమార్చన జరుపుతారు. ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి ఆధ్వర్యంలో అంతరాలయంలో పాశుర విన్నపం చేస్తారు.
జమలాపురంలోనూ ఉత్సవాలు
ఎర్రుపాలెం, ఆగస్టు 19: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు గురువారం రెండోరోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయంలో అష్ణోత్తర కలశస్నపనం, సకల దేవతామూర్తుల పవిత్రధారణ కార్యక్రమాలను అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో నిర్వహించారు.