ఎగువన వర్షాలతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరడంతో సాగర్ ఆయకట్టు కింద ఉన్న అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. గురువారం నాగార్జునసాగర్‌లో వదిలిన నీరు సోమవారం తెల్లవారుజామున పాలేరుకు వచ్చిచేరింది. ఈసారి సాగర్ ఆయకట్టుకు నీటి సమస్య ఉత్పన్నం కాదని ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కరుణించిన కృష్ణమ్మతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. గత సంవత్సరం పంటలకు నీరు లేకపోవడంతో లక్షలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఈసారి వరద పోటెత్తడంతో ఒక్కసారిగా జలాశయాల్లోకి నీళ్లు చేరాయి. మొన్నటి వరకూ అడుగంటి కన్పించిన శ్రీశైలం, సాగర్ జలాశయాలు వారం రోజుల్లోనే నిండాయి. జలాలు పుష్కలంగా ఉండడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. సాగర్ ఆయకట్టు పరిధిలో అవకాశం ఉన్న 330 వరకు చెరువులను త్వరలో నింపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కూసుమంచి, ఆగస్టు 4: ఖమ్మం జిల్లాకు సాగర్ నీటిని అందించే పాలేరు రిజర్వాయర్ కింద 17 మండలాల్లోని 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. ఈ సంవత్సరం వానకాలం సీజన్‌కు నీరు వస్తుందో రాదో అనే సందిగ్ధం నెలకొన్న తరుణంలో పాలేరులో ఇటీవల తాగునీటికీ కటకటగా మారింది. గతంలో ఎన్నుడూ లేని విధంగా దారుణంగా నీటిమట్టం పడిపోయింది.
ఇక జూలై మూడో వారంలో కూడా నీరులేక వెలవెలబోయిన జలాశయమే కన్పించింది. కానీ ఇప్పుడు క్రమంగా నీరు చేరుతోంది. ఎగువన ఉన్న శ్రీశైలం, సాగర్ జలాశయాలు ఇప్పటికే నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సాగర్ నుంచి సముద్రంలోని నీటిని వదలాలని అధికారులు నిర్ణయించారు. ఈక్రమంలో ఎడమ కాలువకు పూర్తిస్థాయిలో నీటిని ఇచ్చి అన్ని చెరువులు, చెక్‌డ్యాంలు, ఎత్తిపోతల పథకాలను నింపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సాగర్ నుంచి వదిలిన నీరు సోమవారం తెల్లవారే వరకు పాలేరు రిజర్వాయర్ నాయకన్‌గూడెం ఇన్‌ఫాల్ వద్దకు వచ్చి పాలేరులో చేరనున్నాయి. వానకాలం పంటలకు ఎలా నీరు ఇవ్వాలనే విషయంలో ఇప్పటికే ఒక అంచానాకు వచ్చిన అధికారులు.. నీరు పుష్కలంగా ఉండడంతో రెండు పంటలకూ ఈసారి ఢోకా లేదని చెబుతున్నారు. కానీ నీటిని జాగ్రత్తగా వినియోగించాలని సూచిస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా గత యాసంగిలో రైతులు నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేశారు.
సాగర్ జలాలు సమృద్ధిగా ఉండడంతో రైతులు సంతోషంతో ఉన్నారు. పాలేరు పాత కాలువకు శనివారం రాత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీటిని విడుదల చేశారు. దీంతో కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోని 20 వేల ఎకరాల్లో సాగునీరు అందనుంది. గత వానకాలం సీజన్లో సాగర్ ఆయకట్టులో పుష్కలంగా పంటలు సాగయ్యాయి. పాలేరు నుంచి కల్లూరు వరకు రెండో జోన్ కింద, కల్లూరు నుంచి కృష్ణా జిల్లా నూజివీడు వరకు మూడో జోన్ ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేశారు.
సాగర్ ఆయకట్టు పరిధిలో గల జిల్లాలోని 239 చెరువులను ఈసారి వానకాలంలో సాగర్ నీటిని నింపి ఆయకట్టు రైతులకు అందించనున్నారు. కూసుమంచి నుంచి కల్లూరు వరకు గతంలో సాగర్ రెండో జోన్ పరిధిలోని అన్ని చెరువులకు సాగు నీటిని అందించేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
పాలేరు కింద గల సాగర్ ఎడమ కాలువ రెండో జోన్‌కు రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయకట్టు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీతో నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.