
కొత్తగూడెం/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 18: ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి, రెవెన్యూ, పోలీసు, వైద్య, విద్యుత్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్య, ఆర్టీసీ, పోస్టల్ అధికారులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెంలో 7, భద్రాచలంలో 4, పాల్వంచలో 4, మణుగూరులో 3, ఇల్లెందులో 4, అశ్వారావుపేటలో 3, చర్లలో 1, బూర్గంపాడులో 1, పినపాకలో 1, గుండాలలో 2, టేకులపల్లిలో 1, దుమ్ముగూడెంలో 1, ములకలపల్లిలో 1, జూలూరుపాడులో 1 కలిపి మొత్తం 34 కళాశాలల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి రోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షల కోసం విద్యార్థులు 9 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, 9:30 తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేదిలేదని చెప్పారు. జిల్లాలో 8,119తోపాటు వృత్తి విద్యాకోర్సును అభ్యసిస్తున్న 2,738 మందితో కలిపి మొత్తం 10,857 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. నోడల్ అధికారి సులోచనారాణి కన్వీనర్‌గా, మణుగూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సయ్యద్ యూసఫ్, అశ్వాపురం హిస్టరీ లెక్చరర్ సుధాకర్‌రెడ్డిలను సభ్యులుగా నియమించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను తహసీల్దార్లు, ఎంపీడీఓలు పరిశీలించాలన్నారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్కాడ్ విధులు నిర్వహించే విధంగా తహసీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు.