
భద్రాద్రి ఆలయంలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు
భద్రాచలం, ఆగస్టు 18: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా జరుపుతున్న పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గతేడాది కాలంలో స్వామివారికి నిర్వహించే పూజల్లో తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహారం కోసం ఏటా దేవస్థానంలో పవిత్రోత్సవాలను ఆగమశాస్త్ర ప్రకారంగా నిర్వహించడం ఆచారం. ఇందులో భాగంగా బుధవారం ఉదయం యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన నిర్వహించారు. సాయంత్రం సమస్త మంగళవాయిద్యాలతో శ్రీరంగం దివ్యక్షేత్రం నుంచి తీసుకొచ్చిన పట్టు పవిత్రాలు, నూలు పవిత్రాలను సంధ్యా సమయంలో రామయ్య పాదాల చెంత ఉంచి యాగశాలలో పవిత్రాదివాస హోమాన్ని నియమ నిష్టలతో జరిపించారు. యాగశాలలో పవిత్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవ పెరుమాళ్లకు బేడా మండపంలో 108 వెండి కలశాలతో దేవతలను ఆవాహన చేశారు.
రేపు శ్రావణ శుక్రవారం పూజలు
శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారమ్మ వారి సన్నిధిలో సామూహిక సహస్రనామ కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు.
జమలాపురం ఆలయంలో..
ఎర్రుపాలెం, ఆగస్టు 18: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ఆలయంలో ప్రాతఃకాల పూజలు, సర్వాంగాభిషేకం, అనంతరం వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీఅలివేలుమంగ, పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారిని పల్లకీలో తొడ్కొని వచ్చి యాగశాల ప్రవేశం గావించారు. విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్వికరణం, మృత్యంగ్రహణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం తరఫున దేవాలయ ఈవో కొత్తూరి జగన్మోహన్రావు పట్టువస్ర్తాలు సమర్పించారు.