
జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మందికి అందజేత
పంపిణీని ప్రారంభించనున్న మంత్రి, ఎమ్మెల్యేలు
మామిళ్లగూడెం, డిసెంబర్ 17: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ముస్లింలకు రంజాన్ తోఫా, తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు, క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్‌లను ఏటా పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది సైతం నిరుపేద క్రైస్తవులకు బహుమతులు అందిస్తోంది. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు మొత్తం ఐదు వేల గిఫ్ట్‌లు చేరుకున్నాయి. వీటిని ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని తహసీల్దార్లకు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు అందజేశారు. వీటిని మండలాల వారీగా అధికారులతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజేషన్స్ కమిటీ (సీసీవోసీ) ద్వారా వివిధ చర్చీల నిర్వాహకులు గుర్తించిన పేదలకు పంపిణీ చేయనున్నారు. నియోజకవర్గానికి వెయ్యి చొప్పున గిఫ్ట్‌లు వచ్చాయి.
అందరివాడిగా సీఎం కేసీఆర్..
ముఖ్యమంత్రి కేసీఆర్ అందరివాడిగా చరిత్ర సృష్టిస్తున్నారు. అన్ని మతాలకూ సమ ప్రాధాన్యమిస్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు. అన్ని మతాల ప్రజలూ వారి పండుగలను సంతోషంగా జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. వారి ప్రార్థనా మందిరాలను ఆధునీకరించుకునేందుకు సైతం నిధులిస్తున్నారు.
నిరుపేద క్రైస్తవులకే గిఫ్ట్ ప్యాకులు..
ఖమ్మం జిల్లాలోని 5 వేల మంది అత్యంత నిరుపేద క్రైస్తవులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గిఫ్ట్ ప్యాకులు అందజేయనున్నారు. ఈ ప్యాకెట్లో ఒక చీర, జాకెట్, ప్యాంట్, షర్ట్, పంజాబీ డ్రెస్ ఉన్నాయి. కుటుంబంలోని తల్లిదండ్రులకు, కుమార్తెకు ఈ దుస్తులను అందిస్తున్నారు. పండుగ రోజున కొత్త బట్టలు కొనుక్కోలేని నిరుపేద క్రైస్తువులకు ఈ గిఫ్ట్‌లు వరంలా మారాయి.
గొప్ప ముఖ్యమంత్రి.. కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలకూ సమ ప్రాధాన్యమిస్తున్నారు. అన్ని
మతాల్లోని నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సాయం అందిస్తున్నారు. ఆయన చాలా గొప్పవారు. జీసస్ దీవెనలు ఆయనపై మెండుగా ఉంటాయి. పండుగ రోజున ఏ మతం వారైనా కొత్త దుస్తులు ధరిస్తారు. వాటిని కొనుక్కోలేని వారి కోసమే సీఎం కేసీఆర్ క్రిస్మస్ గిఫ్ట్ కింద నూతన వస్ర్తాలు అందిస్తున్నారు.
-జీ.వీరబాబు, క్రీస్తు విశ్వాసి, లక్ష్మీపురం, ముదిగొండ
క్రిస్మస్ కానుకలు పంపిణీకి సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిరుపేద క్రైస్తవులకు పంపిణీ చేసే కానుకలు జిల్లాకు వచ్చాయి. వాటిని పంపిణీ చేసేందుకు ఆయా నియోజకవర్గ కేంద్రాలకు పంపించాం. క్రిస్మస్ సైలబ్రేషన్స్ ఆర్గనైషన్స్ కమిటీ గుర్తించిన నిరుపేదలకు వాటిని పంపిణీ చేస్తాం. పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు.
-జీ.జ్యోతి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి