
సత్తుపల్లి డివిజన్లో 180 మంది రైతులకు రూ.16 కోట్లు విడుదల
నెలాఖరు వరకు మరో 5 గ్రామాల రైతులకు రూ.31 కోట్లు చెల్లింపు
3,371 మంది రైతుల నుంచి 1,356.20 ఎకరాల భూమి సేకరణ
పొన్నెకల్ నుంచి జిల్లా సరిహద్దు వరకు 92 కిలో మీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవే
అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్
మామిళ్లగూడెం, డిసెంబర్17: గ్రీన్పీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (నేషనల్ హైవే అథారిటీ) మంజూరు చేసిన నష్ట పరిహారాన్ని సత్వరం అందజేస్తామని అదనపు కలెక్టర్ మధుసూదన్ తెలిపారు. కలెక్టరేట్లోని చాంబర్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్ నుంచి సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు సరిహద్దు వరకు 92 కి.మీ పొడవునా 60 మీటర్ల వెడల్పుతో గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందన్నారు. రహదారి నిర్మాణానికి జిల్లాలోని 31 గ్రామాలకు చెందిన 3,371 మంది రైతులు 1356.20ఎకరాల భూమిని కోల్పోతున్నారన్నారు. నేషనల్ హైవే అథారిటీ ఎకరానికి రూ.22.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిందన్నారు. ఇప్పటికే పెనుబల్లి మండలంలోని కోండ్రుపాడు, సత్తుపల్లి మండంలోని సదాశివునిపాలెం, తుంబూరుకు చెందిన 180 మంది రైతులకు రూ.16 కోట్లు చెల్లించామన్నారు. రెండు రోజుల్లో తల్లాడ మండలంలోని రామానుజవరానికి చెందిన 34 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.5.57 కోట్లు జమ చేస్తామన్నారు. కల్లూరు మండలంలోని చండ్రుపట్ల, పేరువంచ, పెనుబల్లి మండలంలోని చింతగూడెం, వేంసూరు మండలంలోని అడసర్లపాడుకు చెందిన 258 మంది ఖాతాల్లో ఈ నెల 30లోపు రూ.25.46 కోట్లు జమ చేస్తామన్నారు. హైవే కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. మరో నెల రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి భూములను నేషనల్ హైవే అథారిటీకి అప్పగిస్తామన్నారు.