
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ సరికాదు
జిల్లాలో కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె
కేంద్ర ప్రభుత్వ తీరుపై రెండోరోజూ నిరసన
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 17: కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె రెండో రోజు శుక్రవారమూ కొనసాగింది. ఫలితంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు చట్టం చేస్తున్న కేంద్ర సర్కారు వైఖరిపై పీఎస్బీల ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మంలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఉద్యోగుల ఆందోళనకు వామపక్ష కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సీపీఎం, ఎన్డీ, ఐఎఫ్టీయూ నాయకులు నున్నా నాగేశ్వరరావు, గోకినపల్లి వెంకటేశ్వరరావు, రామారావు, ఎర్రా శ్రీకాంత్, బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ నాయకుడు కనకం జనార్దన్రావులు బ్యాంకు ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలకూ సేవలందిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం సరికాదన్నారు. కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకే కేంద్రం ఈ ప్రైవేటీకరణ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీని, మరో రెండు జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల నాయకులు రాజేశ్, శ్రీకాంత్, నాగేందర్, కుమార్, సునీల్, నందన్, చిన్నప్పరెడ్డి పాల్గొన్నారు.