
ఉచిత విద్యుత్‌తో దాచాపురంలో ఏడాదికి రెండు పంటలు
గన్నవరం, గరికపాడు గ్రామాల్లో పుష్కలంగా నీరు
జాలిముడి ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో సిరుల పంట
లిఫ్టులు, మోటార్లతో 2500 ఎకరాల్లో ధాన్యపు సిరులు
సొసైటీలో గిట్టుబాటు ధరకు ధాన్యం విక్రయం
వైరా, ఆగస్టు 16: నాడు.. కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎప్పడు పోతుందో తెలియని పరిస్థితి.. వచ్చిపోయే కరెంట్‌తో మోటార్లు, స్టార్టర్లు కాలిపోయేవి.. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి.. రాత్రిపూట పొలానికి నీరు పారించేందుకు వెళ్లి రైతులు మృత్యువాత పడిన సంఘటనలున్నాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 24 గంటల ఉచిత విద్యుత్ కర్షకుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నది. రెండు పంటలకు పుష్కలంగా నీరు అందుతున్నది. ఉచిత విద్యుత్‌తోపాటు జాలిముడి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వైరా మండలంలోని దాచాపురంతోపాటు గన్నవరం, గరికపాడు గ్రామాల రైతులకు వరంగా మారింది.
గ్రామస్తులంతా ఐక్యంగా తలా కొంత సమకూర్చి 1989లో మారుతి పంపింగ్స్ స్కీం పేరిట లిఫ్టును నిర్మించుకున్నారు. దళిత రైతులకు సంబంధించిన నగదును అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్, ఏపీఎస్ఐడీసీ చెల్లించింది. మిగిలిన రైతులు వారి వాటాను వారే చెల్లించుకున్నారు. వైరా నది ఆధారంగా సుమారు 500 ఎకరాలకు ఈ లిఫ్టు సాగునీటిని అందిస్తుంది. అప్పట్లో వైరా నదిలో నీటి నిల్వ ఉండకపోవడం, ఉచిత విద్యుత్ లేకపోవడంతో రైతులు ఈ లిఫ్టు కింద పంటల సాగు చేసేందుకు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తుండడంతో ఈ లిఫ్టు కింద రైతులు 500 ఎకరాల్లో రెండు పంటలనూ పుష్కలంగా పండిస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో 1998లో ఎస్సీ కార్పొరేషన్ ఓ లిఫ్టును నిర్మించింది. దీని ద్వారా 70 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ లిఫ్టు కింద సుమారు 100 ఎకరాలకు పైగా పంటలు పండుతున్నాయి. ఈ రెండు లిఫ్టుల కింద 600 ఎకరాలు సాగవుతున్నాయి.
450 మోటార్లు.. 1,900 ఎకరాలు..
దాచాపురంతోపాటు గన్నవరం, గరికపాడు గ్రామాల్లో సుమారు 450 విద్యుత్ మోటార్ల కింద 1,900 ఎకరాల్లో పంటల సాగవుతున్నాయి. వైరా నది పరీవాహక ప్రాంతంలో జాలిముడి బ్యాక్ వాటర్‌కు మోటార్లు ఏర్పాటు చేసి ఈ పంటలను పండిస్తున్నారు. ఉచిత విద్యుత్‌తో నెల రోజుల క్రితమే సుమారు 2,500 ఎకరాల్లో వరినాట్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 450 మోటార్ల కోసం 120 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు.
సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోళ్లు..
దాచాపురం, గరికపాడు, గన్నవరం గ్రామాల్లో పండించే ధాన్యాన్ని సొసైటీల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఒక్కో ఎకరాకు 28 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 2,500 ఎకరాల్లో ఒక సీజన్లో సుమారు 70 వేల క్వింటాళ్ల ధాన్యం పండుతుంది. ఈ మొత్తాన్ని వైరా, గరికిపాడు సొసైటీల ద్వారా గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.
లిఫ్టులు, మోటార్లతోనే రెండు పంటలు..
24 గంటల ఉచిత విద్యుత్‌తో మోటార్లు, లిఫ్టుల కింద రెండు పంటలనూ రైతులు పండిస్తున్నారు. దాచాపురం, గన్నవరం, గరికపాడుల్లో మోటార్లు, లిఫ్టుల కింద సుమారు 2500 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఏడేళ్లుగా వానకాలం, యాసంగి సీజన్లలో క్రమం తప్పకుండా రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు.
-శ్రీనివాస్, ఐబీ డీఈ, వైరా
30 ఏళ్లుగా లిఫ్టు కింద పంటల సాగు..
దాచాపురంలో గ్రామస్తులు 30 ఏళ్లుగా లిఫ్టు కిందే పంటలను సాగు చేస్తున్నారు. 1989లో రైతులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో మారుతి లిఫ్టు పంపింగ్ స్కీంను నిర్మించాం. అప్పట్లో వైరా నదిలో నీరు ఉండేది కాదు. విద్యుత్ సమస్యతో ఒక పంట మాత్రమే పండేది. గత ఏడేళ్లుగా రెండు పంటలను పుష్కలంగా సాగు చేస్తున్నాం.
-అయిలూరి శ్రీనివాసరెడ్డి, మారుతి పంపింగ్ స్కీం చైర్మన్