
భద్రాద్రిలో 18 నుంచి 22 వరకు నిత్యకల్యాణాలు రద్దు
భద్రాచలం, ఆగస్టు 16: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో మంగళవారం పవిత్రోత్సవాలకు అంకురార్పణ గావించనున్నారు. పవిత్రమైన ఉత్సవం కాబట్టి వీటిని పవిత్రోత్సవాలుగా పిలుస్తారు. తమిళనాడులోని శ్రీరంగం దివ్యక్షేత్రంలో నూలు, పట్టు దారంతో ఆరు నెలల పాటు ముత్తయిదువులు, కన్యలు, బాలురు 500 మంది పవిత్రాలను తయారు చేస్తారు. వీటిని దేశంలోని అన్ని దేవాలయాలకు పంపిణీ చేస్తారు. ముఖ్యంగా సింహాద్రి, యాదాద్రి, భద్రాద్రి దివ్యక్షేత్రాల్లో పంచారాత్ర ఆగమానుసారంగా ఈ ఉత్సవాన్ని 28 మంది రుత్విక్లతో జరిపిస్తారు. శ్రావణ శుద్ధ దశమి నుంచి శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు ఉత్సవాలను జరుపుతారు. శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అనేవి మూడూ ఒక్కటే.
పవిత్రోత్సవం విశిష్టత ఇదీ..
రామాలయంలో నిర్వహించే పూజల్లో వచ్చే మంత్ర లోపం, పూజా లోపం, తంతు లోపం, ద్రవ్య లోపం, కాలాతీతం, తత్సత్ దోష ప్రాయశ్చిత్ర నివారణ వంటి వాటి కోసం శ్రావణ శుద్ధ దశమి నుంచి శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు (ఐదు రోజుల పాటు) ఈ పవిత్రోత్సవాన్ని నిర్వహిస్తారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు పవిత్ర గోదావరి నదీ మధ్య భాగం నుంచి పడవలో తీర్థాన్ని తీసుకొని వస్తారు. (నదీ మధ్య భాగంలో 500 నదులు ప్రవహిస్తాయన్నది శాస్ర్తోక్తి) సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అంతరాలయంలో ఆరాధన జరుపుతారు. ఈ రోజు నుంచి (ఈ నెల 18 నుంచి 22 వరకు) స్వామివారికి నిత్య కల్యాణాలు, ఏకాంత సేవలు రద్దు చేశారు.