
ప్రశ్న ఎంతటి క్లిష్టమైనా ఆన్సర్ అతడి సొంతం
కోటి’ గెలుచుకున్న భద్రాద్రి జిల్లా వాసి రాజారవీంద్ర
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ విజేత సబ్ ఇన్స్పెక్టర్
కొత్తగూడెం, నవంబర్ 15: ప్రశ్నలు ఎంతటి క్లిష్టమైనవైనా సమాధానం అతడి సొంతం. అదే అతడి విశిష్టత. అతడి పేరే రాజారవీంద్ర. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. ఓ టీవీ షో నిర్వహించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో రూ.కోటి గెలుచుకున్నాడు. ఇంతకీ ఆయన స్వస్థలం ఎక్కడనుకుంటున్నారు? భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండల కేంద్రం. ‘కోటి గెలుచుకున్న భద్రాద్రి జిల్లా వాసి’ అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన ఆ షోలో రూ.కోటి గెలుచుకోవడమే కాదు.. ఉద్యోగ విధుల్లోనూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. అలాంటి రాజారవీంద్ర.. ఆ షోలో కోటి రూపాయల ప్రశ్నకు ఠక్కున సమాధానం చెప్పి నిర్వాహకులను, ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేశారు. ‘రాజా ది గ్రేట్’ అనిపించుకున్నారు.
ప్రస్థానం ఇదీ..
రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బీవీఎస్ఎస్ రాజు – శేషుకుమారి దంపతుల కుమారుడు రాజారవీంద్ర. ప్రస్తుతం డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల షోలో పాల్గొన్న ఆయన.. అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇచ్చారు. రవీంద్రకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్ష్ కార్తికేయ, కుమార్తె కృతి అన్విక ఉన్నారు. వైరాలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన రాజా రవీంద్ర.. ఖమ్మం వజీర్ సుల్తాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశారు. బీటెక్, ఎంఏ ఎల్ఎల్బీ తరువాత.. 2012లో పోలీసు శాఖలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని సర్కిల్ ముత్తారం పీఎస్‌లో ఎస్సైగా విధుల్లో చేరారు. 2015 నుంచి హైదరాబాద్‌లో సైబర్ క్రైంలో, సీఐడీ సైబర్‌క్రైంలో విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖలో 2015 నుంచి పిస్టల్, రైఫిల్ కాంపిటేషన్‌లో తెలంగాణ పోలీస్ శాఖ నుంచి వివిధ పోటీల్లో పాల్గొన్నారు. 2016లో పూణెలో జరిగిన షూటింగ్లో కాంపిటేషన్‌లో ఎయిర్ రైపిల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. 2017లో గౌహతిలో జరిగిన షూటింగ్ కాంపిటేషన్‌లో ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. 2019లో తెలంగాణ పోలీస్ శాఖ నుంచి ఆలిండియా పిస్టల్ కాంపిటేషన్ సిల్వర్ మెడల్ సాధించాడు. 2018, 19 చైనాలో జరిగిన వరల్డ్ పోలీస్ షూటింగ్ కాంపిటేషన్‌లో కూడా పాల్గొన్నారు.
టీజర్లో ప్రకటించిన హోస్ట్..
‘మీలో ఎవరుకోటీశ్వరుడు’ షోలో రాజారవీంద్ర రూ.కోటి గెలుచుకున్నట్లు ఆ కార్యక్రమ హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ టీజర్లో ప్రకటించారు. సోమవారం నాటి షోలో 11వ ప్రశ్న వరకూ వచ్చాక ఎపిసోడ్ సమయం పూర్తయింది. మంగళవారం జరిగే తదుపరి ఎపిసోడ్లో విజేతగా రాజారవీంద్రను ప్రకటించి రూ.కోటి చెక్‌పై సంతకం చేసి అందించనున్నారు.