
అక్రమ దత్తత అనర్థాలకు మూలం
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
సీరియల్ నంబర్, సీనియారిటీ ప్రకారం పిల్లల దత్తత
చట్టబద్ధతతో ప్రక్రియకు పెరుగుతున్న ఆదరణ
ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 14:బోసి నవ్వులు ఇంట్లో సవ్వడి చేయాలని.. చిరు నడకలు సందడి చేయాలని.. కల్మషం లేని మోములు ఆనందాలు పంచాలని.. కల్మషం ఎరుగని మనసులు ప్రేమానురాగాలను పెనవేయాలని ప్రతి జంట కలగంటుంది.. కానీ కొన్ని జంటలకు కొన్ని కారణాలతో సంతానం కలుగదు. వారు పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటారు. లేదా కొందరు ఒంటరి స్త్రీ/పురుషులు పిల్లలను చేరదీయాలనుకుంటారు. వీరందరి అభీష్టాన్ని నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్న మ్యాన్యువల్ దత్తత విధానానికి స్వస్తి పలికి ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. నియమ నిబంధనలు పాటించి పిల్లలను దత్తత తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారి కోసమే ఈ కథనం.
కొందరు దంపతులకు సంతానం అందదు. వారికి పిల్లలను దత్తత తీసుకోవాలని ఉంటుంది. కొందరికి అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం ఇష్టం. వీరందరి అభీష్టాన్ని వేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్న మాన్యువల్ దత్తత విధానానికి స్వస్తి పలికి ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అక్రమ మార్గాన పిల్లలను దత్తత తీసుకున్న వారు గతంలో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. చిన్నారులు సైతం నిరాదరణకు గురైన ఘటనలు ఉన్నాయి. వీటి నివారణకు స్త్రీ,శిశు సంక్షేమశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. ఆన్లైన్ దత్తతపై ఐసీడీఎస్ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు దంపతులకు అవగాహన కల్పిస్తున్నారు.
దత్తత విధానం ఇలా..
దత్తత కోరుకునే దంపతులు తమ డాక్యుమెంట్లను carings.nic.in అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ రిజిష్ర్టేషన్ తర్వాత రిజిష్ర్టేషన్ నెంబర్, పాస్వర్డ్ రశీదు స్లిప్ పొందాలి. ఆన్లైన్ తర్వాత డాక్యుమెంట్లను మూడు కాపీల చొప్పున జిరాక్సు తీయించాలి. వీటితో పాటు రూ.6 వేల విలువైన డీడీని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలి. దంపతులకు 30 రోజుల్లో హోం స్టడీ పూర్తవుతుంది. ఆ తర్వాత సంక్షేమశాఖ వారికి సీరియల్ నంబర్ కేటాయిస్తుంది. అనంతరం వారు యూజర్ నేమ్, పాస్వర్డ్, సీరియల్ నెంబర్ దంపతులు తమ సీనియారిటీని తెలుసుకోవచ్చు. అధికారులు వారి మెయిల్‌కు చిన్నారుల ఫొటో, మెడికల్ రిపోర్ట్, చైల్డ్స్టడీ రిపోర్ట్ వారి లాగిన్‌కు పంపిస్తారు. దరఖాస్తుదారులు ఆ వివరాలు డౌన్లోడ్ చేసుకుని తమకు విశ్వాసం ఉన్న వైద్యుడితో చిన్నారికి వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. ఒకవేళ చిన్నారి నచ్చితే వారిని ఆన్లైన్లో రిజర్వ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దత్తత అభ్యర్థనకు రూ.4 వేల డీడీ అందజేయాల్సి ఉంటుంది. చిన్నారిని దత్తత పొందిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి బేబీ అభివృద్ధి నివేదికలను రెండు సంవత్సరాల పాటు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
తల్లితండ్రుల అర్హతా ప్రమాణాలు ఇవీ..
దత్తత తీసుకునే తల్లిదండ్రులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంతో ఉండాలి. నిబంధనలకు తగిన ఆర్థిక స్తోమత ఉండాలి. దత్తతకు భార్యాభర్తలిద్దరి సమ్మతి అవసరం. ఒంటరి స్త్రీలు మగ, ఆడ బిడ్డల్లో ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు. ఒంటరి పురుషుడు మాత్రం కేవలం మగబిడ్డను తీసుకోవడానికి అర్హుడు. ఒంటరి స్త్రీ/పురుషుడి వయస్సు 45 ఏళ్లలోపు ఉండాలి. దంపతులైతే వారి వైవాహిక జీవితానికి కనీసం రెండేళ్లు పూర్తయి ఉండాలి. నెలలు నిండిన శిశువులు మొదలుకొని నాలుగేళ్ల చిన్నారులను తల్లిదండ్రులు దత్తత తీసుకోవచ్చు. ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లలు కలిగిన దంపతులకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న పిల్లల దత్తత వర్తించదు. వారికి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు మాత్రమే దత్తతకు వర్తిస్తుంది.
దత్తతకు అవసరమైన ధ్రువపత్రాలు
పిల్లలను దత్తత తీసుకునే దంపతులు లేదా దత్తత తీసుకునే వ్యక్తి ఫొటో, తల్లిదండ్రుల పాన్కార్ట్, జనన ధ్రువీకరణ పత్రం (పిల్లలను దత్తత తీసుకునే తల్లిదండ్రుల పుట్టిన తేదీ ధ్రువపత్రాలు), నివాస ధ్రువీకరణ పత్రం(ఆధార్ కార్డ్/ఓటర్ కార్డ్/ పాస్‌పోర్ట్/కరెంట్ బిల్లు/ టెలిఫోన్ బిల్లు), ఆదాయానికి సంబంధించిన రశీదు (పే స్లిప్/ప్రభుత్వం జారీ చేసే ఆదాయ ధ్రువపత్రం, మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి ధ్రువపత్రం (దతత్త తీసుకునే తల్లిదండ్రులకు ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు, ప్రాణాంతక వ్యాధులు లేవని రుజువు), దంపతుల వివాహ ధ్రువీకరణ పత్రం, భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే కోర్టు డిక్రీ తప్పనిసరి, దత్తత స్వీకరణకు మద్దతుగా స్నేహితులు, బంధువుల నుంచి రెండు మద్దతు లేఖలు అవసరం.
ఆన్లైన్ విధానంలోనే..
పిల్లలు లేని దంపతులకు దత్తత ప్రక్రియ సులభతరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఆసక్తి కలిగిన దంపతులు లేదా వ్యక్తులు జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు. చట్ట ప్రకారం పిల్లలను దత్తత తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు ఉండవు. పిల్లల అక్రమ దత్తతతో మున్ముందు సమస్యలు తలెత్తవచ్చు. సంతానం లేని తల్లిదండ్రులు ఆన్లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి.