
అలసత్వం వద్దు.పనుల్లో వేగం పెరగాలి
వచ్చే ఏడాదిలో తరగతులు ప్రారంభం కావాలి
పనుల పరిశీలనలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్
కొత్తగూడెం, నవంబర్ 14: మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆదివారం ఆయన పాల్వంచలోని కేఎస్ ప్రాంతంలో రూ.38 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులకు స్కిల్డ్ వర్కర్ల నైపుణ్యాన్ని వినియోగించాలని సూచించారు. వచ్చే నెల కల్లా పనులు పూర్తి చేయాలన్నారు. ఆర్అండ్బీ ఈఈ బీమ్లాను పనులపై ఆరా తీశారు. పనుల్లో జాప్యం వద్దన్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రి,రామవరం ఎంసీహెచ్ భవనాన్ని పరిశీలించారు. వచ్చేనెల 7లోగా నర్సింగ్ కళాశాల నిర్మాణం, రామవరం మాతా శిశు కేంద్రం, ప్రధాన వైద్యశాలలో చేపట్టిన పనులను పూర్తి చేయాలని అన్నారు. డిసెంబర్ 7లోగా అన్ని పనులను పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఐదెకరాల్లో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలకు ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. నర్సింగ్ కళాశాల ప్లింత్ భీం పనులను నాలుగురోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్య కళాశాలకు 330 బెడ్స్ అవసరం ఉన్నందున నర్సింగ్ కళాశాలలో 100, రామవరంలోని మాతాశిశు కేంద్రంలో 100, జిల్లా ఆస్పత్రిలో 130 బెడ్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కలెక్టర్ వెంట రోడ్లు భవనాల శాఖ ఈఈ భీమ్లా, డీఈ నాగేశ్వరరావు, ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు, పర్యవేక్షకురాలు సరళ, ఆర్ఎంవో రవిబాబు, జోనల్ మేనేజర్ రాథోడ్, డిప్యూటీ జీఎం సంతోష్‌కుమార్, ఏఈ మధుకర్, షరీఫ్ పాల్గొన్నారు.