
ఇదే పాన్ ఇండియా లక్ష్యం
జిల్లా జడ్జి హరేకృష్ణ భూపతి
ఖమ్మం లీగల్, నవంబర్ 14 : భారతదేశానికి స్వాతం త్య్రం వచ్చి 75సంవత్సరాలైన సందర్భంగా న్యాయసేవా సంస్థలు నిర్వహించిన పాన్ ఇండియా కార్యక్రమాల లక్ష్యం స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలన్నదేనని జిల్లా జడ్జి సి.హరేకృష్ణ భూపతి అన్నారు. 44రోజుల ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమం ఆదివారం ఖమ్మం కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14వరకు న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పారా లీగల్ వలంటీర్లు, ప్యానెల్ న్యాయవాదులు ఎంతో పట్టుదల, నిబద్ధతతో జిల్లాలోని అన్ని గ్రామాలకు మూడు పర్యాయాలు వెళ్లి న్యాయ సేవలపై అవగాహన కల్పించారని ప్రశంసించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి పి.చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ 13 నుంచి 14 సంవత్సరాల పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. అదనపు పోలీస్ కమిషనర్ ఐ.పూజ మాట్లాడుతూ గ్రామాల సదస్సులను విజయవంతం చేసినందుకు న్యాయసేవా సంస్థ పరివారాన్ని అభినందించారు. న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ జావీద్‌పాషా మాట్లాడుతూ పాన్ ఇండియా కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో పాన్ ఇండియాకు సహకరించిన ఇమ్మడి లక్ష్మీనారాయణ, కన్నాంబ, ముక్తేశ్వరరావు, కె.జగన్మోహన్రావుకు జ్ఞాపిక బహూకరించారు. ప్రచురణకు సహకరించిన న్యాయవాదులు కొండపల్లి శ్రీనివాస్, మద్దినేని నాగేశ్వరరావు, ఇమ్మడి లక్ష్మీనారాయణ, జీవీ లక్ష్మీనారాయణకు జిల్లా జడ్జి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.