
ఖమ్మంలో పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి అజయ్
భద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
సింగరేణి ప్రధాన కార్యాలయం, ఐటీడీఏలోనూ వేడుకలు
కొవిడ్ తగ్గుముఖం పట్టడంతోఈసారి ఘనంగా ఉత్సవాలు
శకటాలు, స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
ఖమ్మం, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనాతో రెండేళ్లుగా వేడుకలు సాదాసీదాగా జరిగాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదాన్‌లో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. భద్రాచలం ఐటీడీఏలో ప్రాజెక్టు అధికారి, కొత్తగూడెం పట్టణం ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరుగనున్నది.
స్వాతంత్య్ర దిన వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధమయ్యాయి. ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వైరస్ కారణంతో రెండు సంవత్సరాలుగా స్వాతంత్య్ర దిన వేడుకలు కొవిడ్ నిబంధనల మధ్య సాదాసీదాగానే జరిగాయి. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పట్టడంతోపాటు నిబంధనలకు కొంతమేరకు సడలింపు ఉండడంతో ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే శకటాల ప్రదర్శన, వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు, ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులకు అవార్డుల ప్రదానం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదాన్‌లో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. భద్రాచలం ఐటీడీఏలో ప్రాజెక్టు అధికారి ఆధ్వర్యంలో మువ్వన్నెల పతాక ఆవిష్కరణ జరుగనుంది. కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలోనూ త్రివర్ణ పతాక ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగనున్నాయి. ఇక్కడ సింగరేణి డైరెక్టర్ (పా) జాతీయ జెండాను ఎగువేయనున్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా అభివృద్ధిపై ఖమ్మంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సావనీర్‌ను చదివి వినిపించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, సీసీ, ఎస్పీ, జడ్పీ చైర్మన్లు, ఇతర శాఖల అధికారులు తమ తమ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు.