కూసుమంచి, ఏప్రిల్ 19 : పాలేరు రిజర్వాయర్ నిండుకుండలా మారింది. దీంతో ఎడమ కాలువ రెండో జోన్కు ఆదివారం 1,450 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి పాలేరుకు నీటిని నిలిపివేయడంతో ఈ నెల 14వ తేదీన పాలేరు రిజర్వాయర్ నుంచి దిగువకు నీటిని నిలిపివేశారు. సాగర్ నీటిని నిలిపివేసిన తరువాత కాలువలో ఉన్న నీరు పాలేరుకు వచ్చి చేరటంతో 21.50 అడుగులు నీటిమట్టం ఆదివారం నాటికి 22.95 అడుగులకు చేరింది.
2.588 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లో ప్రస్తుతం 2.549 టీఎంసీల నీరు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 22.95 అడుగులు ఉంది. ఇంకానీరు సాగర్ నుంచి 1,400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండడంతో నీరు వృథాకాకుండా పాలేరు ఎడమ కాలువకు 1,450 క్యూసెక్కుల నీటిని ఆదివారం వదిలారు. పాలేరు చానల్ కింద ఉన్న కూసుమంచి, నేలకొండపల్లి మండలాలకు సాగునీరు అందించే కాలువకు నీటిని నిలిపివేశారు.
భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి సైతం నీటిని నిలిపివేశారు. మిషన్ భగీరథ ఎత్తిపోతలకు 135 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా దిగువకు 1,450 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా 25 క్యూసెక్కుల నీరు ఆవిరవుతున్నది. పాలేరు రిజర్వాయర్ ద్వారా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల ప్రజలకు ‘మిషన్ భగీరథ’ తాగునీటిని అందిస్తున్నామని, వేసవిలో కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వదులుతామని సీఈ మంగళపుడి వెంకటేశ్వర్లు తెలిపారు.