
ఉపాధిహామీ పథకంలో నిధుల దుర్వినియోగం
సామాజిక తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలు
ఇప్పటికే 13 సార్లు సోషల్ ఆడిట్
మొత్తం బకాయిలు రూ.6.19 కోట్లు
అంతంతమాత్రంగా రికవరీ
ఖమ్మం, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఉపాధి హామీ పథకంలో భాగంగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణానికి విడుదలైన నిధులను కొందరు అధికారులు పక్కదారి పట్టించారు.. ఏటా సామాజిక ఆడిట్ బృందాలు క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించి అవకతవకలను నిగ్గు తేలుస్తున్నా వాటిపై స్పందన కరువైంది. నిధుల రికవరీపై పట్టింపు లేకపోవడం, నిధులు మళ్లించిన అధికారులపై చర్యలు నామమాత్రంగా ఉండడం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో చర్చనీయాశంగా మారింది. ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి దాపురించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకంలో నిధుల దుర్వినియోగం కనిపిస్తున్నది. జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణం, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్సుతో పాటు ఇతర నిర్మాణ పనులు ఏటా జరుగుతున్నాయి. వీటిపై సోషల్ అడిట్ క్రమం తప్పకుండా జరుగుతుంది. ఇప్పటివరకు సామాజిక తని ఖీ బృందాలు 13 సార్లు ఆడిట్ నిర్వహించి నిధుల దుర్వినియోగాన్ని గుర్తించినప్పటికీ అధికారుల నుంచి రికవరీ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నది. మొత్తం రికవరీ రూ.6.19 కోట్లు ఉన్నది. మరోవైపు నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు నామమాత్రంగా ఉండడం చర్చనీయాశంగా మారింది. అక్రమాలు తేలినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో బాధ్యులకు ఏమీ కాదులే అనే ధీమా ఏర్పడినట్లు కనిపిస్తున్నది. ఉన్నతాధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రికవరీపై అలసత్వం..
గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్స్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేసిన నిధులపై ఆడిట్ బృందం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని రికవరీలకు సంబంధించి తరచూ ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం పెద్దగా ఉండడంలేదనే భావన వ్యక్తమవుతున్నది. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిలో వివిధ హోదాల్లో పని చేసే ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కొందరిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. మరికొందరు మాత్రం ఇప్పటికీ విధుల్లో కొనసాగుతున్నారు. ఉపాధి పనుల నిర్వహణలో ఏపీవో, ఇంజినీరింగ్ కన్సల్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు భాగస్వాములుగా ఉన్నారు. వీరికి నిధుల దుర్వినియోగానికి గల సంబంధాన్ని ఇప్పటికే తేల్చిన అధికారులు వారి నుంచి సొమ్ము రాబట్టడంలో మాత్రం ‘ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి..’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఉపాధి పథకంలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులే కాకుండా ఎంపీడీవోలు, ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, గ్రామ సమాఖ్యలు, బ్రాంచ్ పోస్ట్మాస్టర్లు, బ్యాంకు మిత్రలు సైతం సామాజిక తనిఖీల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు నిగ్గు తేల్చారు. ప్రధానంగా పలువురు ఎంపీడీవోలు ఆయా స్థానాల నుంచి బదిలీలు అయినప్పటికీ ఆడిట్ నిగ్గు తేల్చినా నిధులను మాత్రం జమ చేయకుండానే మరో ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.
ఆడిట్ బకాయిలు ఇలా…
ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన పనులను సోషల్ ఆడిట్ చేసిన బృందం వివిధ స్థాయిల్లో అధికారులు తప్పిదాలు చేసినట్లు గుర్తించింది. జరిగిన నష్టాన్ని తిరిగి వారి ద్వారానే వసూలు చేయాలని సిఫార్సు చేసింది. ఇప్పటివరకు 13 సార్లు చేసిన ఆడిట్లలో గుర్తించిన నిధుల దుర్వినియోగాన్ని అధికారుల నుంచి రికవరీ చేయాల్సి ఉన్నది.