
మామిళ్లగూడెం, నవంబర్ 13: లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. కోర్టు ప్రాసెస్ విధులు నిర్వహించే కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ ఆఫీసర్లతో శనివారం స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్లో సీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్తులను చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడమే లక్ష్యంగా కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పనిచేయాలని సూచించారు. నేరం చేస్తే శిక్ష తప్పదనే భావన నేరస్తుల్లో కలిగించినపుడే నేరాలు నియంత్రణలో ఉంటాయన్నారు. నేర నిరూపణ, శిక్ష ఖరారు తగ్గితే.. అది సమాజంలోని ప్రజల భద్రత, రక్షణపై ప్రభావితం చూపుతుందనే విషయాన్ని గ్రహించాలని స్పష్టం చేశారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తకువ సమయంలో చట్ట ప్రకారం నేరస్తులకు శిక్ష పడేలా చేయడమే విధిగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని సూచించారు. నిర్మాణాత్మక విధానం, క్రమపద్ధతిలో పర్యవేక్షణ, సాక్ష్యాధారాలతో కూడిన పోలీసింగ్‌తో ముందుకు సాగితే ప్రతి కేసులోనూ నేరస్తులకు శిక్ష పడే ఆవకాశం కచ్చితంగా ఉంటుందన్నారు. వివిధ కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చే ఉత్తర్వులు, తీర్పులు, సూచనలను రిజిస్టరులో నమోదు చేసుకోవాలని సూచించారు. అదే విధంగా కోర్టుల్లో కేసులు పెండింగులో లేకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయమూర్తుల ఆదేశాలను అనుసరిస్తూ సాక్షులను, నిందితులను సకాలంలో కోర్టుకు హాజరు పరిచేలా కృషి చేయాలన్నారు. ఆన్లైన్లో ఎలాంటి పెండింగ్ లేకుండా రోజు వారీ కేసుల వివరాలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కోర్టు కానిస్టేబుళ్లతో సంబంధిత అధికారులు విధిగా సమీక్ష సమావేశం నిర్వహించి వారి సందేహాలని నివృత్తి చేస్తూ పెండింగ్ కేసులపై సూచనలు చేయాలన్నారు. కోర్టు విధులు నిర్వర్తించే సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కోర్టు ప్రాసెస్ డ్యూటీలో ఉత్తమ ప్రతిభ చూపిన పలువురు సిబ్బందికి సీపీ విష్ణు రివార్డులు అందజేశారు. అడిషనల్ డీసీపీ కే.ప్రసాద్, సీఐలు తుమ్మ గోపి, సాంబరాజు, ఆర్ఐ శ్రీశైలం పాల్గొన్నారు.