
అడవి దున్న దాడిలో గాయపడిన గిరిజనుడికి ఫేస్ రీ కనస్ట్రక్షన్ చికిత్స
ట్విట్టర్లో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి, అజయ్ అభినందన
కొత్తగూడెం, నవంబర్ 13: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామనడానికి కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో సమ్మయ్య అనే గిరిజనుడికి నిర్వహించిన ఫేషియల్ రీ-కన్స్ట్రక్షన్ సర్జరీనే నిదర్శనం. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్య రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారనడానికి నిదర్శనం ఈ ఘటన అని, అరుదైన శస్త్ర చికిత్సతో సమ్మయ్య ప్రాణాలు కాపాడిన కొత్తగూడెం ఆస్పత్రి ఈఎన్టీ వైద్యుడు రవిబాబుతోపాటు వైద్య బృందాన్ని రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.
అడవి దున్న దాడిలో గాయాలు..
భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన మొక్కటి సమ్మయ్య ఈ 26వ తేదీన మేతకు పశువులను అడవికి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో ఓ అడవిదున్న సమ్మయ్యపై దాడి చేసింది. ఘటనలో సమ్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ముఖం ఛిద్రమైంది. పలుచోట్ల గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సల కోసం చేరాడు. డాక్టర్ రవిబాబు నేతృత్వంలోని వైద్య బృందం సమ్మయ్యకు ఫేషియల్ రీ కన్స్ట్రక్షన్ సర్జరీ చేశారు. సమ్మయ్య ముఖాన్ని పూర్వ స్థితికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న మంత్రులు హరీశ్‌రావు, అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్.. వైద్య బృందాన్ని అభినందించారు. 18 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న సమ్మయ్య పూర్తిగా కోలుకొని మామూలు స్థితికి వచ్చాడు. కార్పొరేట్ ఆస్పత్రిలో దాదాపు రూ.10 లక్షలు అయ్యే చికిత్స సమ్మయ్యకు ఉచితంగా అందిందని వైద్యులు తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందుతుందని వారు వెల్లడించారు.