
తెలంగాణ సర్కార్ రిజర్వేషన్ల ఫలితం
నేడు కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం
హాజరుకానున్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 13 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ సారథిగా తొలిసారిగా మహిళా నాయకురాలు బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదాపుగా 8 దశాబ్దాల చరిత్ర కలిగిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఆది నుంచి నేటి వరకు కేవలం పురుషులు మాత్రమే చైర్మన్‌గా వ్యవహరించారు. ఎట్టకేలకు 11వ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఓ దళిత మహిళకు పట్టం కట్టడంతో 80 ఏండ్ల కల సాకారం అయినైట్లెంది. ఖమ్మం నగరానికి చెందిన ఉన్నత విద్యావంతురాలు, వ్యవసాయ కుటుంబం నేపథ్యం కలిగిన డౌలే లక్ష్మీప్రసన్న చైర్మన్‌గా, రఘునాథపాలెం మండలం కోటపాడు గ్రామం రైతు కుటుంబానికి చెందిన కొంటెముక్కల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్‌గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితోపాటు పత్తిపాక రమేశ్, దేవత్అనిల్, రఘునాథపాలెం, చింతకాని మండలాలకు చెందిన మరో ఆరుగురు పాలక వర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. సభా వేదిక, ఆహ్వానితులకు ఆహ్వానాలు, ఇతర వసతులకు సంబంధించిన ఏర్పాట్లను మార్కెట్ కమిటీ సెక్రటరీ, అధికారులు పూర్తి చేశారు. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ హాజరుకానున్నారు.
తెలంగాణ సర్కార్ రిజర్వేషన్ల ఫలితంగానే..
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ల చైర్మన్లు కావాలంటే నాటి పాలకుల అభీష్టం మేరకే నియమించేవారు. స్వరాష్టంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీంతో సబ్బండవర్గాలకు అవకాశాలు వస్తున్నాయి. తొలిసారిగా మార్కెట్ కమిటీ పాలకవర్గంలో రిజర్వేషన్ విధానం అమలు చేశారు. రాబోయే పాలకవర్గాలకు ముందుగానే రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో తెలంగాణ ఆవిర్భావం తరువాత ఖమ్మం ఏఎంసీ చైర్మన్‌గా బీసీ కులానికి చెందిన ఆర్జేసీ కృష్ణ, అనంతరం ఓసీ కులానికి చెందిన మద్దినేని వెంకటరమణకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అవకాశం కల్పించారు. అదే తరహాలో నేడు ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా డీ లక్ష్మీప్రసన్నకు మంత్రి పువ్వాడ అవకాశం కల్పించారు.