
ఖమ్మం, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రం వైఖరిపై గులాబీ సైన్యం జంగ్ సైరన్ మోగించింది. బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై కదం తొక్కింది. కర్షకులకు న్యాయం జరిగే వరకు పోరుబాటలో పయనిస్తామని శపథం చేసింది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలు విజయవంతమయ్యాయి. వివిధ గ్రామాల నుంచి రైతులు భారీగా తరలొచ్చారు. యాసంగి ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌కు రైతులు మద్దతు తెలిపారు. ఖమ్మం నగరంలోని ధర్నాచౌక్‌లో నిర్వహించిన మహాధర్నాకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ధర్నాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరుబాట తప్పదని పేర్కొన్నారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, వారి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందని, ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉపఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోయిందని, తెలంగాణ రైతులతో పెట్టుకుంటే
భవిష్యత్‌లోనూ ఇదే తరహా ఫలితాలు వస్తాయన్నారు.
రాష్ట్రంలోని రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. అప్పటి వరకూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీని మొలవనీయమని, నిలవనీయమని అన్నారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ అధిష్ఠానం ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ధర్నాలు నిర్వహించారు. ఖమ్మం ధర్నాచౌక్‌లో జరిగిన మహాధర్నాలో మంత్రి అజయ్‌కుమార్‌తోపాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎంపీ నామా, మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ పొంగులేటి కలిసి ఎడ్లబండిపై సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కొర్రీలు పెడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సింహంలాంటి వారని, ఆయన సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని అన్నారు. రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో వరిపంట ఎక్కడ వేశామో చూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే పరిశీలించాలని సవాల్ విసిరారు. లేదంటే తొండి మాటలు మానుకోవాలని హితవు చెప్పారు. కేసీఆర్‌పై బీజేపీ నేతలు ఒక్క విమర్శ చేసినా టీఆర్ఎస్ సైన్యం ఊరుకోబోదని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, రైతుబంధు సమితి సభ్యులు మందడపు సుధాకర్, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కేఎంసీ మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, టీఆర్ఎస్ నేతలు డాక్టర్ దయానంద్, చిరుమామిళ్ల రవికిరణ్, ఆర్జేసీ కృష్ణ, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు..
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తెల్లం వెంకట్రావు, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిరలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, పాలేరులో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్ ఆధ్వర్యంలో మహాధర్నాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.
కేంద్రానిది రెండు నాలుకల ధోరణి: ఖమ్మం ఎంపీ నామా
ధాన్యం కొనుగోలుపై కేంద్రం రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో మరొక మాట చెబుతూ రైతుల సహనాన్ని పరీక్షిస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోలు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన కేంద్ర మంత్రులే ఇప్పుడు మాటతప్పుతున్నారని, ఇందుకు సంబంధించి అనేక ఆధారాలున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉన్నారని అన్నారు.
కేంద్రానికి కనువిప్పు కలిగేలా రైతుల ధర్నా: పొంగులేటి
తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి కనువిప్పు కలిగేలా కర్షకులు ధర్నా చేస్తున్నారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ధాన్యం పండించే రైతులపై కేంద్ర ప్రభుత్వం కత్తికట్టినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతుల పక్షాన పోరాడడంలో టీఆర్ఎస్ ఎప్పుడూ అగ్రభాగానే ఉంటుందని అన్నారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకూ కేసీఆర్ నాయకత్వంలో పోరాడి తీరుతామని స్పష్టం చేశారు.