
ఖమ్మం జిల్లాలో 177, భద్రాద్రిలో 178 పాఠశాలల్లో నిర్వహణ
హాజరైన 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులు
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవోలు, సీబీఎస్ఈ ప్రతినిధులు
ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 12: విద్యార్థుల్లోని సామర్థ్యాలను పరీక్షించేందుకు జాతీయ స్థాయిలో శుక్రవారం నిర్వహించిన న్యాస్ పరీక్ష (నేషనల్ అసెస్మెంట్ సర్వే) ఖమ్మం జిల్లాలో విజయవంతమైంది. జిల్లాలోని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు తరగతుల వారీగా పరీక్ష జరిగింది. 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు ఎంపిక చేసిన సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించి వారి సామర్థ్యాలను పరిశీలించారు.
177 పాఠశాలల్లో..
జిల్లాలో 177 పాఠశాలల్లో న్యాస్ పరీక్షను నిర్వహించారు. 3వ తరగతికి 52 స్కూళ్లలో 1,012 మంది, 5వ తరగతికి 46 స్కూళ్లలో 1,004 మంది, 8వ తరగతికి 58 స్కూళ్లలో 1,545 మంది, 10వ తరగతికి 68 స్కూలో 1,859 మంది విద్యార్థులు న్యాస్ పరీక్ష రాశారు.
కేంద్రాల తనిఖీ..
న్యాస్ పరీక్ష జరుగుతున్న కేంద్రాలను సీబీఎస్ఈ బోర్డు ప్రతినిధులు థామస్, సోనియా అనిల్ వర్మ, స్టేట్ అబ్జర్వర్లు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఈవో యాదయ్య, సెక్టోరల్ అధికారులు వై.రాజశేఖర్, సీహెచ్ రామకృష్ణ తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
భద్రాద్రి జిల్లాలో..
కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 12: జిల్లాలోని 178 పాఠశాలల్లో శుక్రవారం జాతీయ సర్వే పరీక్ష ముగిసింది. 3, 5, 8, 10 తరగతులు చదువుతున్న 5,208 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని డీఈవో సోమశేఖరశర్మ తెలిపారు. సీబీఎస్ఈ 212 ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరిశీలకులుగా, 321 మంది బీఈడీ కళాశాలల విద్యార్థులు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా వ్యవహరించారు. పలు పాఠశాలలను జిల్లా అకడమిక్ కో-ఆర్డినేటర్ నాగరాజశేఖర్, ఉమ్మడి జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి మాధవరావు తనిఖీ చేశారు.