
కేంద్రంలోని బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం: ఎంపీ నామా
ధాన్యం కొనుగోలుపై వివక్ష తగదు: ఎమ్మెల్యే కందాళ
రైతులకు అండగా తెలంగాణ సర్కారు: తాతా మధు
కూసుమంచి, నవంబర్ 12: రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ శుక్రవారం పాలేరులో సూర్యాపేట – ఖమ్మం రహదారిపై రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ధర్నా విజవంతమైంది. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని దుయ్యబట్టారు. కేంద్రం రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలను తీసుకొచ్చిందని, ఏడాదిగా నిరసనలు వ్యక్తం చేస్తున్నా.. కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని, యాసంగి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు నష్టం జరుగకుండా చూడాలని కోరారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కర్షకులకు అండగా నిలుస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు యండపల్లి వరప్రసాద్, బానోత్ శ్రీనివాస్, బోడా మంగీలాల్, వేణు, బెల్లం వేణుగోపాల్, వెంకన్న, బానోత్ రాంకుమార్, మరికంటి ధనలక్ష్మి, మద్దినేని స్వర్ణకుమారి, ఇంటూరి శేఖర్, చాట్ల పరశురాం, బ్రహ్మయ్య, వీరన్న, బెల్లం ఉమ, వజ్జా రమ్య పాల్గొన్నారు.