
ఆవుల మందపై దాడి
దూడను చంపిన పులి
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు
భయాందోళనలో ప్రజలు
పినపాక, నవంబర్12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అడవుల్లో పులి సంచరిస్తున్నది. మూడు రోజుల క్రితం ములుగు జిల్లాలోని తాడ్వాయి, నర్సింహాసాగర్లో సంచరించిన పులి గురువారం భద్రాద్రి జిల్లాలోని కరకగూడెం అడవుల్లోకి ప్రవేశించింది. శుక్రవారం పినపాక మండలంలోని అమరారం పంచాయతీ పరిధిలోని జూజాల చెరువు వద్ద ఆవుల మందపై దాడి చేసింది. దీంతో పశువుల కాపరులు అక్కడి నుంచి పారిపోయారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ ఉన్నతాధికారులు, సిబ్బంది గ్రామస్తులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో ఆవుదూడ మృతిచెందినట్లు ఫారెస్ట్ కన్జర్వేటర్ భీమా, డీఎఫ్వో లక్ష్మణ్ రంజిత్నాయక్, మణుగూరు ఎఫ్డీవో మంజుల, ఈబయ్యారం ఎఫ్ఆర్వో తేజస్విని ధ్రువీకరించారు. గ్రామస్తులు ఆందోళనకు గురికావొద్దని సూచించారు. ప్రజలు అడవుల్లో సంచరించవద్దన్నారు. రైతులు వ్యవసాయ భూముల్లో కరెంట్ తీగలు అమర్చవద్దన్నారు. ఆయుధాలతో వేటాడవద్దన్నారు. విద్యుత్ తీగలు అమర్చితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.