
కర్షకులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్
రైతు ధర్నాలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి, నవంబర్ 12: నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం రైతుల ఉసురు తీసుకుంటుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. అన్నదాతలను విస్మరిస్తే బీజేపీ ప్రభుత్వానికి ఉరి ఖాయమని స్పష్టం చేశారు. సత్తుపల్లిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ధర్నాకు రైతులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలొచ్చారు. రైతులతో కలిసి అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్ర చేపట్టారు. అంబేద్కర్‌సెంటర్ వద్ద రైతుధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ దేశానికి సైనికుడు ఎంత ముఖ్యమో.. అన్నం పెట్టే అన్నదాత అంతే ముఖ్యమని అన్నారు. పంజాబ్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం.. తెలంగాణను విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులు పండించిన ప్రతీగింజను కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ద్వారా స్పష్టమైన హామీ ఇప్పిస్తే బీజేపీ నాయకులకు రైతుల సమక్షంలో పూలాభిషేకం చేస్తామని సవాల్ విసిరారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో రైతుల నిరసనలో 600 మందికి పైగా చనిపోయినా బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి చలనమూ లేదని మండిపడ్డారు. కేంద్రం రేపో మాపో దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతోందని విమర్శించారు.