
మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు
కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్ష
నిమిషం నిబంధన అమలు
134 మంది విద్యార్థులు గైర్హాజరు
కేంద్రాల్లో ఎన్టీఏ ప్రతినిధుల తనిఖీ
ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 12: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్ ఖమ్మం జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలో తొమ్మిది కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. విద్యార్థులు నీట్ పరీక్షకు అత్యధిక స్థాయిలో హాజరవుతుండడంతోపాటు గతంలో నిర్వహించిన అనుభవంతో పూర్తి స్థాయిలో సకల సౌకర్యాలూ కల్పించారు. తొమ్మిది కేంద్రాల్లో 3,421 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 134 మంది గైర్హాజరయ్యారు. 3,287 మంది విద్యార్థులు హాజరయ్యారు. 96.08 శాతం హాజరు నమోదైందని నీట్ సిటీ కో ఆర్డినేటర్ రామసహాయం పార్వతిరెడ్డి తెలిపారు.
ఎన్టీఏ ప్రతినిధుల పర్యవేక్షణ..
పరీక్ష జరుగుతున్న తీరును ఎన్టీఏ అధికారులు పర్యవేక్షించారు. కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ ధపా ప్రశ్నపత్రాలకు సంబంధించిన బాక్సులకు డిజిటల్ లాకింగ్ సిస్టం అమర్చారు. ఏ సమయానికి ఓపెన్ అయిందనే అంశం నమోదవుతుంది. ఓపెన్ కాని వాటిని అబ్జర్వర్ల వద్ద ఉన్న కార్డు సహాయంతో తెరిచారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అన్ని సెంటర్ల కెమెరాలను పరిశీలించారు.
ముందుగానే కేంద్రాలకు..
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పరీక్షకు నిమిషం నిబంధన ఉండడంతో విద్యార్థులు ఉదయం పది గంటలకే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకూ విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షను నిర్వహించారు.
క్షుణ్ణంగా తనిఖీలు..
విద్యార్థులను మెటల్ డిటెక్టర్లతో నిశితంగా తనిఖీ చేశారు. చెవుల దిద్దులు, కాళ్ల పట్టీలు, షూ, వంటి వాటిని తీసిన తర్వాతే కేంద్రాలోకి అనుమతించారు.
వీడియో రికార్డింగ్..
విద్యార్థులు కేంద్రంలోకి అడుగు పెడుతున్న సమయం నుంచి వీడియో రికార్డింగ్ చేశారు. హాల్‌టికెట్‌లో ఉన్న విద్యార్థి, పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి ఒకరేనా అనే అంశంపై తనిఖీ చేయడంతోపాటు ప్రవేశ ద్వారం వద్ద నుంచే రెండు కెమెరాలతో వీడియో తీయించారు. పరీక్ష మొదలైన తర్వాత నుంచి పరీక్ష జరుగుతున్న సమయం వరకూ వీడియో రికార్డింగ్ చేశారు.
చాలా సులువుగా పేపర్..
నీట్ పరీక్షలో ఈసారి నూతనంగా సెక్షన్ బీలో మార్పులు చేశారు. 15 ప్రశ్నలు ఇచ్చి 10 సమాధానాలు రాసేందుకు అవకాశం కల్పించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి సబ్జెక్టుకు 45 ప్రశ్నల చొప్పున 180 ప్రశ్నలకు 180 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 720 మార్కులకు పరీక్ష నిర్వహించారు. నెగిటివ్ మార్కులు సైతం ఉన్నాయి. ఫిజిక్స్‌లో టైం ఎక్కువ తీసుకునే ప్రశ్నలు ఉండగా.. కెమిస్ట్ట్రీ ప్రశ్నలు మధ్యస్థంగా, బోటనీ, జువాలజీ ప్రశ్నలు సులువుగా వచ్చాయని ఫిజిక్స్ నిపుణుడు రాయల సతీశ్‌బాబు చెప్పారు.
కొవిడ్ నేపథ్యంలో..
కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులను థర్మల్ స్క్రీనింగ్ చేసిన అనంతరమే కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతి విద్యార్థికీ శానిటైజర్, ఎన్ 95 మాస్కు అందజేశారు. ఐసొలేషన్ రూంలనూ ఏర్పాటు చేశారు.