
రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే విజయం
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు
భద్రాచలం నియోజకవర్గ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్
పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలి: మహబూబాబాద్ ఎంపీ కవిత
భద్రాచలం, సెప్టెంబర్ 12: టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. భద్రాచలంలోని హరిత హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. 60 లక్షల సభ్యత్వాలు కలిగిన ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,673 గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వివరించారు. ఈ నెల 13 నుంచి 20 వరకు మండల కమిటీలను, 20 నుంచి 30లోపు జిల్లా కమిటీలను ఎన్నుకోనున్నట్లు చెప్పారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందన్నారు. గ్రామ కమిటీల్లో అవకాశం రాని వారికి మండల, జిల్లా కమిటీల్లో అవకాశం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ పట్ల, టీఆర్ఎస్ పార్టీ పట్ల రాష్ట్ర ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తిరుపతి వెళ్లడంతో మరోసారి ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామ కమిటీల అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీల సమష్టి నిర్ణయంతో మండల కమిటీనీ ఎన్నుకోబోతున్నట్లు చెప్పారు. జిల్లా కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామన్నారు. రా్రష్ట్రంలో ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే విజయమని స్పష్టం చేశారు.
అనంతరం మహబూబాబాద్ ఎంపీ మాళోత్ కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. భద్రాచలం అభివృద్ధికి టీఆర్ఎస్ కృషి చేస్తోందన్నారు. భద్రాద్రి రామాలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరినట్లు చెప్పారు. అలాగే పాండురంగాపురం – సారపాక వరకు 13 కిలోమీటర్ల రైల్వే లైన్ కోసం కృషి చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, మాజీ ఇన్చార్జి మానె రామకృష్ణ, చర్ల ఏఎంసీ కమిటీ ఛైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, భద్రాచలం మండల అధ్యక్ష కార్యదర్శులు యశోద నగేశ్, అరికెల్ల తిరుపతిరావు, సీనియర్ నేత తిప్పన సిద్ధులు, నాయకులు తాళ్ల రవి, ప్రబోద్‌కుమార్, తుమ్మలపల్లి ధనం, పరుచూరి రవి, మామిడి పుల్లారావు, బషీర్, ప్రేమకుమార్, దుమ్ముగూడెం మండల అధ్యక్షుడు అన్నెం సత్యాలు తదితరులు పాల్గొన్నారు.