
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కుటుంబానికి అండగా ఉంటాం
విలేకరుల సమావేశంలో 300 మంది ప్రజాప్రతినిధులు
కొత్తగూడెం, ఆగస్టు 12: రాజకీయ ఉనికి కోసమే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుటుంబంపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ ఆరోపణలన్నీంటిని తిప్పికొడతామని, వనమా కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న కమ్మసత్రంలో 300 మంది ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిట్టని వారు కొందరు ప్రతి దానికీ వనమా రాఘవను టార్గెట్ చేస్తున్నారని, అది వారికి పరిపాటిగా మారిందని అన్నారు. వనమా రాఘవ సమర్థుడు, నాయకత్వ పటిమ గలవాడు కావడం వల్లే గిట్టని వారు బెంబేలెత్తి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి, వనమా కుటుంబానికి తిరుగులేదని అన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను కలిసి పరిస్థితులను వివరిస్తామన్నారు. వనమా రాఘవపై పెట్టిన కేసుపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి అసలైన దోషులను శిక్షించాలని కోరారు. కొత్తగూడెంలో మెడికల్, నర్సింగ్ కాలేజీలు మంజూరు చేయించిన ఘనత వనమాకే దక్కుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ మండె వీరహన్మంతరావు, ఏఎంసీ చైర్మన్ భూక్యా రాంబాబు, టీఆర్ఎస్ నేత కిలారు నాగేశ్వరరావు, ఇద్దరు ఎంపీపీలు, 70 మంది సర్పంచ్‌లు, 35 మంది ఎంపీటీసీలు, 25 మంది కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.