కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 4: దండకారణ్యంలో జరిగిన దండాయాత్రలో రక్తం చిందింది. నట్టడవిలో నెత్తుటేర్లు ప్రవహించాయి. ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య శుక్రవారం జరిగిన భీకరపోరులో సాయుధ నక్సలైట్లు పెద్ద సంఖ్యలో ప్రాణాలు విడిచారు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఒక్కసారిగా ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది.ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండూర్ – తులతులీ గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో స్థానిక పోలీసు బలగాలు, డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.
దంతేవాడ – నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లోని ప్రాంతం కావడంతో ఇరు జిల్లాల పోలీసు బలగాలతోపాటు అర్ధసైనిక బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో జవాన్లకు మావోయిస్టులు తారసపడి కాల్పులకు దిగారు. వెంటనే జవాన్లు కూడా అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపారు. మూడు గంటల భీకరపోరు తరువాత జవాన్ల తాకిడిని తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు. కాల్పుల విరమణ అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో ఘటనా స్థలంలో 36 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారికి సంబంధించిన అధునాతన మారణాయుధాలు, ఇతర ఆయుధాలు, వస్తు సామాగ్రిని కూడా జవాన్లు స్వాధీన పరుచుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపులు కొనసాగుతూనే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టులు పీఎల్జీఏ 5, 6 కంపెనీలకు చెందిన సభ్యులుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. 150మందికి పైగానే సాయుధ మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా, 36 మంది మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు చెబుతున్నప్పటికీ 40 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ప్రాథమిక కథనాలు వస్తున్నాయి. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ ‘కగార్’ను భద్రతా బలగాలు వేగవంతం చేస్తూ వెళ్తున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలే పైచేయిగా సాధిస్తున్నాయి. ఈ ఏడాదిలో జరిగిన ఎదురుకాల్పుల్లో 165మందికి పైగానే మావోయిస్టులు మృతిచెందారు. మొన్నటి వరకు జరిగిన భారీ ఎన్కౌంటర్లలో మొత్తం 93 మంది మావోయిస్టులు మృతిచెందగా.. అందులో 36 మంది మహిళలు ఉన్నారు. ‘ఈ ఘటనలో కీలక నేతలెవరైనా ఉన్నారా?’ అనే సందేహాలు నివృత్తి కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ ఘటన ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. ఈ కాల్పుల్లో ఒక కంపెనీ మొత్తాన్ని భద్రతా దళాలు తుడిచిపెట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఒకవేళ అదే జరిగితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. మరికొందరు మావోయిస్టులు బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. నిస్సహాయస్థితిలో ఉన్న కొందరు మావోయిస్టులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఛత్తీస్‌గఢ్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమై సరిహద్దుల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే ప్రత్యేక బలగాలు మావోయిస్టు ప్రభావిత అడవుల్లో గాలింపులు ముమ్మరం చేశాయి. ఎదురుకాల్పుల పూర్తి వివరాలను ఛత్తీస్‌గఢ్ పోలీస్ ఉన్నతాధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, ఎన్కౌంటర్ మృతులు, క్షతగాత్రుల్లో తెలుగు రాష్ర్టాల క్యాడరూ ఉన్నట్లు తెలుస్తోంది.