ఖమ్మం, అక్టోబర్ 11: వ్యవసాయాధారిత భారతంలో తెలంగాణది విశిష్ట స్థానమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అన్నారు. టీటీడీసీలో నిరుద్యోగ వ్యవసాయ పట్టభద్రులకు అవేర్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శిక్షణ వీడ్కోలు సమావేశంలో మంత్రి మాట్లాడారు. నిరుద్యోగ వ్యవసాయ పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు కల్పించి రైతులకు మరింత చేరువ చేసేందకు అగ్రి రైతు సేవా కేంద్రాలు విస్తరింపజేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో సేద్యం పెరిగిందన్నారు. 1.3 కోట్ల టన్నుల ధాన్యం సేకరించి ఎఫ్‌సీఐకి ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణ ద్వితీయ స్థానంలో ఉందని గుర్తుచేశారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులకు మరింత అవగాహన కల్పించడంతోపాటు ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2800కు పైగా వ్యవసాయ విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించిందన్నారు. రానున్న రోజుల్లో పంటల సాగు విధానంలో మార్పులు అవసరమన్నారు. దీనికి అనుగుణంగా అగ్రి ప్రెన్యూర్స్ ఆగ్రో రైతు సేవాల కేంద్రాల ద్వారా రైతుల అవసరాలకు అనుగుణంగా ఇన్‌ఫుట్‌లను అందించాలని సూచించారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ నిరుద్యోగ వ్యవసాయ పట్టభద్రులకు వ్యవసాయానుబంధ రంగాలకు సంబంధించి యూనిట్ల స్థాపన, అభివృద్ధిపై 45 రోజులపాటు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. అవేర్ సంస్థ ఎండీ చంద్రశేఖర్, టీఎస్ ఆగ్రోస్ ఎండీ రాములు మాట్లాడుతూ అగ్రి సేవా కేంద్రాలు రైతులకు మరింత చేరువ అవుతాయన్నారు. కేఎంసీ మేయర్ నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, అవేర్ డైరెక్టర్ లక్ష్మి, ఎస్బీఐ ఏజీఎం వీవీ నారాయణ, మేనేజర్ శివకుమార్, డీఏవో విజయనిర్మల, అవేర్ నోడల్ అధికారి మీరాప్రసాద్, నాబార్డ్ డీడీఎం సుజీత్, హైదరాబాద్ ఎస్బీఐ ఏజీఎం మూర్తి పాల్గొన్నారు.