
ఉమ్మడి జిల్లాలో పట్టణ, గ్రామ కమిటీల జోరు
జాతీయ పార్టీలది అధికారం కోసం పాకులాట : రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్
దళిత బంధుతో ప్రతిపక్షాలకు వణుకు పుడుతోంది : మానుకోట ఎంపీ మాలోత్ కవిత
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలి : పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల, ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం, మణుగూరు రూరల్, కల్లూరు, సెప్టెంబర్ 11;ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. టీఆర్ఎస్ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా పట్టణ, గ్రామ కమిటీలు జోరందుకున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, బాధ్యులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం భద్రాద్రి జిల్లా మణుగూరులో గ్రామ, వార్డు కమిటీ అధ్యక్షులను నియమించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, మానుకోట ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని కార్యకర్తలు ప్రజలకు వివరించి ప్రభుత్వానికి వారధిలా పనిచేయాలని సూచించారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో మధిర నియోజకవర్గ సమావేశం జరిగింది. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి హాజరయ్యారు. కల్లూరులో జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, సత్తుపల్లి సండ్ర వీరయ్య పాల్గొన్నారు.
టీఆర్ఎస్ శ్రేణులు, గ్రామ, మండల కమిటీల నూతన బాధ్యులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గ్రామ, వార్డు స్థాయిల్లో బలంగా ఉన్నప్పుడే పార్టీ మొత్తం బలోపేతం అవుతుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని నూతన కమిటీలకు సూచించారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, మంత్రి సత్యవతి రాథోడ్.. శనివారం మణుగూరులోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో జరిగిన గ్రామ, వార్డు కమిటీ అధ్యక్షుల నియామక కార్యక్రమంలో మాట్లాడారు. కరోనా కారణంగా ఈ సారి సంస్థాగత నిర్మాణం ఆలస్యమైందన్నారు. అధికారం కోసమే జాతీయ పార్టీలు పాకులాడుతున్నాయని, ప్రజలపై కపట ప్రేమ చూపుతున్నాయని అన్నారు. ‘టీఆర్ఎస్’ అంటే తెలంగాణ ప్రజలకు రక్షణ కవచమని అభివర్ణించారు. మహబూబాబాద్ ఎంపీ మాళోత్ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను విమర్శించడాన్నే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయన్నారు.
పినపాక నియోజకవర్గంలో చురుకైన కార్యకర్తలున్నారన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే రేగా కాంతారావు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. అనంతరం గ్రామ, వార్డుల నూతన కమిటీ అధ్యక్షుల పేర్లను చదివి వినిపించారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పీటీసీలు పోశం నర్సింహారావు, కామిరెడ్డి శ్రీలత, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మణుగూరు మండల, పట్టణ అధ్యక్షులు ముత్యంబాబు, అడపా అప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, వైస్ ఎంపీపీ కేవీరావు, టీబీజీకేఎస్ నేతలు వూకంటి ప్రభాకర్‌రావు, సామా శ్రీనివాసరెడ్డి, సర్పంచులు సంఘం మండల అధ్యక్షుడు ఏనిక ప్రసాద్, ఎంపీటీసీ కోటేశ్వరరావు, ఉప సర్పంచ్ శంకర్, నాయకులు తాళ్లపల్లి యాదగిరిగౌడ్, వట్టంరాంబాబు, ప్రభుదాస్, ముద్దంగుల కృష్ణ, ఆత్మకమిటీ చైర్మన్ భద్రయ్య, భవానీశంకర్ పాల్గొన్నారు.