
సంస్థాగత ఎన్నికలతో మధిర నియోజకర్గ శ్రేణుల్లో జోష్
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెవెళ్లాలి: జడ్పీ చైర్మన్
ఖమ్మం, సెప్టెంబర్ 11: సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో మధిర నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కన్పిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో విజయం తథ్యమని స్పష్టం చేశారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన మధిర నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన కమిటీల ఏర్పాటుతో మధిర నియోజకవర్గంలో నూతన ఉత్సాహం ఏర్పడిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నేడు టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని అన్నారు. కాగా, నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు సకాలంలో పూర్తి కావడంపై పార్టీ నాయకులను అభినందించారు. అనంతరం ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రతి గడపకూ చేరేలా కార్యకర్తలు, గ్రామ కమిటీల బాధ్యులు పనిచేయాలని సూచించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య, ఆయా మండలాల జడ్పీటీసీలు, మండలాల అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.