
కూసుమంచి, జనవరి 11 ;ధాన్యం కొనుగోలుపై కేంద్రం కొర్రీలు పెట్టడంతో రైతులు ఇతర పంటల సాగు దిశగా కదులుతున్నారు. దీనికితోడు వరి వేసినా పెద్దగా లాభాలు రాకపోవడంతో ఆసక్తి చూపడం లేదు. రైతులు తమ ‘తాతలు, తండ్రుల నాటి నుంచి వరి వేస్తున్నా.. ఏనాడూ పైసా మిగలలేదని నిరుత్సాహం చెందుతున్నారు. చివరకు గడ్డి కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్, వ్యవసాయ అధికారులు ఆరుతడి, ఉద్యాన పంటలు వేయాలని సూచిస్తున్నారు. దీంతో రైతులు పొద్దుతిరుగుడు, పత్తి, జొన్న, సజ్జ, మినుము, పెసర, వేరుశనగ, కంది, ఆయిల్ పాం తదితర పంటలు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలు వేయాలని యోచిస్తున్నారు.
‘తాతలు, తండ్రుల నాటి నుంచి వరి వేస్తున్నాం. కానీ ఏనాడూ పైసా మిగిలింది లేదు. శ్రమ పెద్దగా ఉండదనే గానీ ఆదాయం శూన్యమవుతోంది. చివరకు గడ్డి కూడా మిగలడం లేదు. ఎనకట చిన్న మొత్తాల్లో ఆరుతడి పంటలు వేసేవాళ్లం. వాటిల్లో జొన్న, సజ్జ, మినుము, పెసర, వేరుశనగ, కంది వంటివి సాగు చేసేవాళ్లం. కానీ కాలక్రమంలో కూలీల కొరత ఏర్పడడం, అందునా కూలి రేట్లు పెరగడం, పైగా ఇలాంటి పంటలకు పెద్దగా మద్దతు ధరలు లేకపోవడం వంటి కారణాలు ఏకమయ్యాయి. దీంతో తక్కువ శ్రమ ఉండే వరి పంటలు చూసుకోవాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సాగునీరు సమృద్ధిగా అందుతుండడంతో వరిపై మరింత మక్కువ పెరిగింది. ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో ధాన్యం విక్రయించుకోవడం సులువైంది. కానీ కేంద్ర విధానాలు, మారిన పరిస్థితుల కారణంగా ఆరుతడి పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అయినా ఈ పరిస్థితుల్లో వరి వేస్తే ఆదాయం సంగతి అలా ఉంచితే ముందు పశువులకు గడ్డి కూడా మిగలడం లేదు.’ అంటున్నారు అన్నదాతలు. కూసుమంచి మండలంలో వరి పంట వేసిన రైతులను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. ప్రస్తుత తరుణంలో వరిసాగుపై ప్రత్యేక కథనం.
ఆదాయాన్ని ఇచ్చే పంటలను వదిలి సహజంగా తరతరాలుగా సాగు చేస్తున్న పంటల వెంటే పయనిస్తున్నారు అన్నదాతలు. దీంతో వేసిన పంటలే వేస్తూ అవకాశాలు, ఆదాయాన్ని కోల్పోతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం పుష్కలమైన సాగునీటి వనరులు కల్పించినప్పటికీ కర్షకులు మాత్రం ఒకేవిధమైన పంటల వైపు వెళ్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఓ వైపు మొండి చేయి చూపిస్తున్నప్పటికీ.. ఎక్కువమంది హలధారుల ఆలోచన వరి సాగు సులభమన్న రీతిలోనే ఉంటోంది. అయితే తెలంగాణ ప్రభుత్వ పిలుపు, వ్యవసాయ అధికారుల సూచనలతో పరిస్థితి కొంత మారింది. అపరాలు ఉద్యాన పంటల వైపు మళ్లింది.
ఐదెకరాల్లో వరి వేస్తే రూ.25 వేలు నష్టం..
5 ఎకరాల్లో వరి వేశా. మొత్తం పెట్టుబడి రూ.1.25 లక్షల పెట్టుబడి అయింది. చివరికి ధాన్యం విక్రయిస్తే రూ.1.30 వచ్చింది. టాక్టర్ నాదే. అయినా కనీసం ఎకరాకు రూ.2 వేలు కూడా మిగలలేదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు ఈ సారి వానకాలం నుంచి పంట మారుస్తాను.
–బారి తిరపయ్య, రైతు, కూసుమంచి
కనీసం గడ్డి కూడా మిగలలేదు..
మూడెకరాల్లో వరి వేశా. ఆదాయ పెద్దగా లేదు. మిషన్ కోత కావడంతో చివరకు గడ్డి కూడా రాలేదు. మూడెకరాల్లో వరి పండిస్తే రూ.1.40 లక్షల ఖర్చు వచ్చింది. ఆదాయం 1.45 లక్షల వరకు వచ్చింది. సొంత ట్రాక్టర్‌తో నేనే పనిచేసినా కనీసం రూ.5 వేలు ఆదాయం రాలేదు.
–నెల్లూరి రవి, రైతు కూసుమంచి
ఇతర పంటలు వేయండి..
వరి వేసినా రైతులకు పెద్దగా లాభం ఉండడం లేదు. అందుకే ఇతర పంటలు వేయాలని సూచిస్తున్నాం. ముఖ్యంగా కూరగాయలు, ఆరుతడి పంటలు వేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. వరితో శ్రమ లేకపోయినా.. ఆదాయం రావడం లేదు.
–ఆర్.వాణి, ఏవో, కూసుమంచి