
కొనసాగుతున్న రైతుబంధు ఉత్సవాలు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు
కర్షక లోగిళ్లలో ప్రత్యేక ఆకర్షణగా ముగ్గులు
ఖమ్మం, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్‌తోపాటు కరువుదీరా నీళ్లిచ్చి సాగును సస్యశ్యామలం చేసింది. కర్షకులు పంట పెట్టుబడి కోసం వడ్డీవ్యాపారుల చుట్టూ తిరగకుండా ‘రైతుబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టి వారికి ఆత్మబంధువుగా నిలిచింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.50,600 కోట్లను పెట్టుబడి సాయంగా అందించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు ఊరూరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో రైతులు టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్తమ రైతులను సన్మానిస్తున్నారు. పల్లెపల్లెనా కర్షకుల లోగిళ్లు రంగవల్లులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ నెల 4న మొదలైన రైతుబంధు ఉత్సవాలు మంగళవారమూ కొనసాగాయి. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ నేతలు, రైతులు ఊరూరా వేడుకలు నిర్వహించారు. మధిర నియోజకవర్గంలో జరిగిన సంబురాలకు ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములునాయక్, సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వేడుకలు నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలంలో మండల అధ్యక్షురాలు బెల్లం ఉమ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదర్శ రైతులను సత్కరించారు. నగరంలోని సమీకృత వ్యవసాయ మార్కెట్లో ఇటీవల రైతుబంధుపై నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలిచిన విజేతలకు ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాలతో పాటు మండల స్థాయి, గ్రామస్థాయిలో జరిగిన వేడుకల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.