
రైతులందరూ వినియోగదారుల మన్ననలు చూరగొనాలి
ఏఎంసీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వార్షికోత్సవంలో చైర్పర్సన్
ఖమ్మం వ్యవసాయం, జనవరి 11: సమీకృత రైతుబజార్.. ఖమ్మం నగరానికి తలమానికంగా నిలిచిందని ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు. నగరంలోని ఇంటిగ్రేటెడ్ (సమీకృత రైతుబజార్) మార్కెట్ మొదటి వార్షికోత్సవాన్ని ఉద్యాన రైతులు, చిరు వ్యాపారులు మంగళవారం సంబురంగా జరుపుకున్నారు. రైతుబజార్ ఎస్టేట్ అధికారి శ్వేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు, చిరు వ్యాపారులు పిల్లలు, ఇతర కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వార్షికోత్సవ కేక్‌ను చైర్పర్సన్ కట్ చేశారు. ‘రైతుబంధు’ ముగ్గుల పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఐదుగురు మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మంత్రి అజయ్‌కుమార్ దూరదృష్టితో ఆలోచించి నగరవాసుల సౌకర్యార్థం సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్ తరువాత తెలంగాణలో మూడో సమీకృత రైతుబజార్ ఖమ్మానిదేనన్నారు. బస్టాండ్ చెంతనే ఉండడంతోపాటు ఒకే దగ్గర వెజ్, నాన్ వెజ్, పూలు, పండ్లు వంటివన్నీ లభించడం గొప్ప విషయమని అన్నారు. మార్కెట్‌కు వచ్చే వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందించి వారి మన్ననలు చూరగొనాలని సూచించారు. గతంలో ఇదే రైతుబజార్లో కూరగాయలు విక్రయించి జీవించి, ఇప్పుడు జబర్దస్త్ కామెడీషోలో నటిస్తున్న ఖమ్మం సుజాత (శేఖర్)నురైతులు, అధికారులు సన్మానించారు. డీఎంవో నాగరాజు, కార్పొరేటర్ వెంకట్‌కుమార్, సెక్రటరీలు మల్లేశం, వీరాంజనేయులు, ఎస్టేట్ ఆఫీసర్లు పద్మావతి, శివరామకృష్ణ, నాయకుడు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.