భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : చీమచిటుక్కుమంటే సమాచారం తెలిసేది గ్రామాల్లో అంగన్వాడీ టీచరమ్మలకే. పాలుతాగే పిల్లల దగ్గర నుంచి బాలింతలు, గర్భిణులు, కిషోర బాలికలు సైతం అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు అందుకోవాల్సిందే. పక్కా సర్వే లెక్క తెలియాలంటే అది అంగన్వాడీ కేంద్రాల ద్వారానే అని అందరికీ తెలుసు. అలాంటి అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పుడు టీచరమ్మలు కరువయ్యారు. పిల్లలకు బువ్వ పెట్టాలన్నా, బాలింతలకు టీకాలు వేయించాలన్నా అక్కడ అంగన్వాడీ సెంటర్ ఉండాల్సిందే. కానీ, పల్లెల్లో ఇప్పుడు టీచరమ్మలు, ఆయాలు లేక అంగన్వాడీ కేంద్రాలు మూతపడే పరిస్థితికి వచ్చేశాయి.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది అంగన్వాడీల పరిస్థితి. సమయానికి గుడ్లు రావు.. ఒకవేళ వచ్చినా తల్లుల పేర్లు ఆన్లైన్ చేయాలంటే సర్వర్ పనిచేయక ఉన్న టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇటు బీఎల్వో డ్యూటీలు చేయలేక.. అటు అంగన్వాడీ విధులు నిర్వహించలేక నానా అవస్థలు పడుతున్నారు. ఖాళీ పోస్టులను సర్కార్ భర్తీ చేయకపోగా ఖాళీగా ఉన్న కేంద్రాలను కూడా మీరే చూడాలని టీచర్లకు అదనపు పనులు అప్పజెప్పడంతో విధులు భారంగా మారాయి. రెండుచోట్ల పనులు చేయలేక పిల్లలందరినీ ఒకేచోటకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,061 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 1,158 టీచర్, ఆయాల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇందులో టీచర్, హెల్పర్ ఇద్దరూ లేని కేంద్రాలు 117 ఉన్నాయంటే ఆశ్చర్యమే. రెండేళ్లుగా ఇన్ని కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు లేకుండా ఎలా నడుస్తున్నాయో అర్థంకాని విషయమే. 177 టీచర్ పోస్టులు, 981 ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ పోస్టులుగా అధికారులు గుర్తించారు. అసలే టీచర్లకు తడిసిమోపెడు ఆన్లైన్ విధులు ఉంటే.. మళ్లీ అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు విధులు నిర్వహించలేమని ఇటీవల ఆందోళనకు సైతం దిగారు. గత సర్కారు హయాంలో అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఇప్పటివరకు హెల్పర్ పోస్టులను కూడా నియమించలేదు. దీంతో ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లే పిల్లలకు తల్లులకు భోజనం వండి పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలే ఇది షెడ్యూల్డ్ ఏరియా.. పోస్టులు నింపాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి ఉండాల్సిందే. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో అధికారులు గ్రామాల్లోకి వెళ్తే ఎప్పుడు పోస్టులు భర్తీ చేస్తారు అంటే సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో మండల సమావేశాల్లో, జిల్లాస్థాయి సమావేశాల్లో అధికారులు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలోని అన్ని మండలాల్లో అంగన్వాడీ అధికారులు ఉన్నా సమయానికి కేంద్రాలకు గుడ్లు, బియ్యం రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. తల్లులు, గర్భిణులు సెంటర్లకు వస్తే గుడ్లు రాలేదు, పాల ప్యాకెట్లు వస్తున్నాయి అని సమాధానం చెప్పాల్సి వస్తోంది. కాంట్రాక్టర్ సమయానికి సరుకులు తోలకపోవడం వల్ల కేంద్రాల్లో స్టాకు ఉండడం లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అన్నీ ఆన్లైన్ చేయడంతో స్టాకు ఇచ్చిన ప్రతిసారి యాప్లో అప్లోడ్ చేయాలంటే సర్వర్ పనిచేయకపోవడంతో టీచర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం సమయంలో సరుకులు రావడంతో కాంట్రాక్టర్లు పక్క సెంటర్లలో సరుకులు దించుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ టీచర్లకు చాలా భారంగా ఉంది. అదనపు విధులు చేస్తున్నారు. అందులో 117 కేంద్రాల్లో టీచర్లు, ఆయమ్మలు లేనే లేరు. వాళ్ల విధులు వీళ్లే నడపాలంటే ఎంత కష్టం. జీతాలు సమయానికి రావు, బిల్లులు సక్రమంగా చేయరు, పోస్టులు నింపరు.. కానీ, అన్ని రిపోర్టులు మాత్రం సమయానికి ఇవ్వాలి. లేకపోతే బెదిరిస్తున్నారు. బండచాకిరీ చేయిస్తున్నారు.
– సీతామహాలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు
మా ఊర్లో సెంటర్ లేదు..
మేము కొత్తగా పదేళ్ల క్రితమే ఊరును ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు అంగన్వాడీ సెంటర్ పెట్టారు. పిల్లలు బాగానే ఉన్నారు. టీచర్ వేరే చోటకు వెళ్లింది. అప్పటి నుంచి ఇక్కడ పిల్లలు వేరే చోటకు వెళ్లాల్సి వస్తున్నది. దూరంగా ఉండటం వల్ల పిల్లలు పొమ్మంటే పోనంటున్నారు. ఇంటికి దగ్గర ఉన్న సెంటర్ను దూరంగా పెడితే ఎలా? మా ఊర్లోనే అంగన్వాడీ కేంద్రం పెట్టాలి.
– ఇర్పా కోటమ్మ, గంటందొరకాలనీ, లక్ష్మీదేవిపల్లి మండలం
ఉన్నతాధి కారులు ఇప్పటికే జిల్లా నుంచి ఖాళీల వివరాలు తీసుకున్నారు. జిల్లాలో 1,158 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ ఏరియాను బట్టి పోస్టుల ఖాళీల వివరాలు తయారు చేశాం. నోటిఫికేషన్ రాగానే భర్తీ చేయడం జరుగుతుంది. బీఎల్వోల విధులు తప్పనిసరిగా చేయాల్సిందే. ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇబ్బంది లేకుండా సరుకులు కేంద్రాలకు సరఫరా చేస్తున్నాం. ఒక్కోసారి సర్వర్ సమస్య వస్తోంది.
– స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమ అధికారి