
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భద్రాద్రి కలెక్టర్ భార్య మాధవి
అభినందనలు తెలిపిన మంత్రులు హరీశ్‌రావు, అజయ్
కొత్తగూడెం/ భద్రాచలం, నవంబర్ 10: అసలే అది ఏజెన్సీలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి. అందులో సింహభాగానికిపైగా ఆదివాసీ బిడ్డలే పురుడు పోసుకుంటారు. అలాంటి గిరిజన ప్రాంతంలో ఉన్న సర్కారు ఆసుపత్రిలో భద్రాద్రి కలెక్టర్ భార్య మాధవి బుధవారం ప్రసవించారు. కలెక్టర్ దంపతులు నివాసముండేది జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో. అయినప్పటికీ మారుమూల ప్రాంతంలోనూ ప్రభుత్వ వైద్యసేవలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని గమనించిన కలెక్టర్ తన భార్యను ప్రసవానికి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రముఖ స్త్రీవైద్య నిపుణులు, గైనకాలజిస్టులు సూరపనేని శ్రీక్రాంతి, భార్గవి, అనస్తీషియా వైద్యురాలు దేవికలు సరిగ్గా బుధవారం తెల్లవారుజామున 1:19 నిమిషాలకు శస్త్రచికిత్స ద్వారా మాధవికి ప్రసవం చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. శిశువును పిల్లల వైద్యనిపుణులు రాజశేఖరరెడ్డి పరీక్షించి వైద్యం అందించారు. అక్కడే ఉన్న కలెక్టర్ అనుదీప్ డెలివరీ గదిలోకి వెళ్లి బిడ్డను చూశారు. వైద్యులను అభినందించారు.
మంత్రులు హరీశ్, అజయ్ అభినందన
తెలంగాణ ప్రభుత్వ వైద్య సేవలు అద్భుతమని నిరూపిస్తూ భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ తన సతీమణికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించడం చాలా గొప్ప విషయమంటూ మంత్రులు హరీశ్‌రావు, అజయ్‌కుమార్ ట్వీట్ చేశారు. కలెక్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంటకటేశ్వరరావు, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఇతర ప్రజాప్రతినిధులు కలెక్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కోరుకున్న మార్పు ఇదే..: అజయ్
ప్రభుత్వ వైద్య సేవలు పొందిన భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ – మాధవి దంపతులను మంత్రి అజయ్ ప్రత్యేకంగా అభినందించారు. సీఎం కేసీఆర్ కోరుకున్న మార్పు ఇదేనని, ప్రభుత్వ వైద్య సేవలపై సీఎం కేసీఆర్ కోరుకున్న మార్పు ఉమ్మడి ఖమ్మం జిల్లాతోనే మొదలుకావడం సంతోషంగా ఉందని అన్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలత, ఇప్పుడు కలెక్టర్ సతీమణి మాధవి ప్రసవించడం గొప్ప మార్పునకు శ్రీకారమని అన్నారు.