
ఎమ్మెల్యే చొరవతో లిఫ్ట్ ఇరిగేషన్ల మరమ్మతు పనులు
చివరి ఆయకట్టు భూములకు చేరిన నీరు
తిరుమలాయపాలెం, ఆగస్టు 10: మండలంలోని పలు గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు మహర్దశ పట్టింది. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నాలుగు ఎత్తిపోతల పథకాలకు ఇరిగేషన్ శాఖ అధికారులు మరమ్మతు పనులు పూర్తి చేసి సాగునీటిని పునరుద్ధరించారు. జిల్లాలో అత్యంత కరువు పీడిత ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి సాగు నీరందించింది. మిగిలిన చివరి ఆయకట్టు భూములకు సైతం సాగు నీరు అందించాలనే లక్ష్యంతో వివిధ గ్రామాల్లో నిరుపయోగంగా మారిన ఎత్తిపోతల పథకాలకు మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కందాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ డీఈ బానాల రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని హైదర్‌సాయిపేట, సోలీపురం, అజ్మీరతండ-1,2 ఎత్తిపోతల పథకాలకు స్వల్పకాలంలోనే మరమ్మత్తులు పూర్తిచేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ల విద్యుత్ మోటర్లకు రీవైండింగ్, ఫేనల్ బోర్డుల మార్పులు, పైపులైన్ల మరమ్మతులు పూర్తి చేసి సాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. ఆకేరు, పాలేరు వాగుల్లో వృథా పోతున్న నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా హైదర్‌సాయిపేట, అజ్మీరతండ, తిప్పారెడ్డిగూడెం, జల్లేపల్లి గ్రామాల్లోని చెరువులకు మళ్లీస్తున్నారు. దీంతో చెరువుల కింద చివరి ఆయకట్టు భూములకు సైతం నీరు అందుతుంది. భక్తరామదాసు పథకం ద్వారా అవకాశం లేని భూములకు వీటి ద్వారా నీరందుతున్నది. హైదర్‌సాయిపేట ఎత్తిపోతల పథకం పునరుద్ధ్దరణతో గత ఇరువై ఏళ్లుగా నిండని పీతిరికుంటకు నీరు చేరుతుందని రైతులు చెప్పారు. ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు నీరు పునరుద్ధ్దరించడంతో రైతులు వరి సాగుకు సిద్ధమయ్యారు.
చివరి ఆయకట్టు భూములకు సాగు నీరు
మండలంలోని నాలుగు ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు పూర్తి చేశాం. హైదర్‌సాయిపేట, తిప్పారెడ్డిగూడెం, అజ్మీరతండా, సోలీపురం గ్రామాల్లో చెరువుల్లోకి నీరు చేరుతుంది. ఆకేరు, పాలేరు వాగుల్లో వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువుల్లోకి మళ్లీస్తున్నాం. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా అవకాశం లేని చివరి ఆయకట్టు భూములకు సాగు అవకాశం మెరుగుపడింది.