ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 16: టెన్త్ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల అనంతరం విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 97 కేంద్రాల్లో జరుగనున్న ఈ పరీక్షలకు 16,514 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకానున్నారు. సిట్టింగ్ స్కాడ్‌లో 97 మంది, ఫ్లయింగ్ స్కాడ్‌లో ఆరుగురితో కూడిన బృందాలు పరీక్షలను పర్యవేక్షించనున్నాయి. వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించనున్నారు. విద్యాశాఖ జేడీ సర్వీసెస్ మదన్మోహన్ టెన్త్ పరీక్షల జిల్లా అబ్జర్వర్‌గా నియమితులయ్యారు.
ఈ మేరకు పరీక్షల నిర్వహణ అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించనున్నారు. కాగా, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను నేరుగా కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌లో చూసేలా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు 97 కేంద్రాల్లోని సుమారు 950కిపైగా గదుల్లో పరీక్షలు జరుగనుండగా కలెక్టర్ ఆదేశాల మేరకు వాటిల్లో 300 గదుల్లో తొలిసారిగా సీసీ కెమెరాలను అమర్చారు. కాగా, పరీక్షల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా డీఈవో సోమశేఖరశర్మ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. 8331851510 నెంబరును కేటాయించి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 16: ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు డీఈవో వెంకటేశ్వరచారి తెలిపారు. జిల్లాలో మొత్తం 12,341 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 70 సెంటర్లు, సప్లిమెంటరీ విద్యార్థుల కోసం 3 సెంటర్లు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
మొత్తం 73 సెంటర్లకుగాను 73 చీఫ్ సూపరింటెండెంట్లు, 73 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 887 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివరించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతాయని, పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లుగానీ ఎలక్ట్రానిక్ వస్తువులనుగానీ అనుమతి లేదని అన్నారు. హాల్‌టికెట్లు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇతర వివరాల కోసం ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావును 9989027943 నెంబరులో సంప్రదించాలని డీఈవో సూచించారు.