ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 7 : పదో తరగతి వార్షిక పరీక్షల సమాధాన పత్రాలు వాల్యుయేషన్ చేసేందుకు ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయుల్లో కొందరు స్కూల్లో రిలీవ్ అయ్యారు కానీ స్పాట్లో రిపోర్టు చేయలేదు. ఉదయం 9గంటలకే స్పాట్‌కి ఉపాధ్యాయులు చేరుకున్నప్పటికీ క్యాన్సిలేషన్ కోసమే చాలామంది ఆసక్తి చూపించారు.
వివరాల్లోకెళ్తే.. సోమవారం ఖమ్మం నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల కేంద్రంగా టెన్త్ స్పాట్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉపాధ్యాయులు రిపోర్టు చేస్తూనే ఉన్నారు. రిపోర్టింగ్ ప్రక్రియను ఎంఈవోలు శైలజాలక్ష్మి, శ్రీనివాస్, వీరాస్వామి నిర్వహించారు. రిపోర్టింగ్ తక్కువ ఉందని క్యాంప్ ఆఫీసర్ ఏటూరి సోమశేఖరశర్మకు డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ వివరించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం 2గంటల తర్వాత స్పాట్ ప్రారంభమైంది.
పదో తరగతి సమాధాన పత్రాలు వాల్యుయేషన్ చేయడంలో అసిస్టెంట్ ఎగ్జామినర్స్, వారికి సహాయంగా ఉండాల్సిన స్పెషల్ అసిస్టెంట్ల కొరత వేధిస్తున్నది. సబ్జెక్ట్ టీచర్లు సైతం ఇంకా అవసరం ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే ఉపాధ్యాయ సంఘ నాయకులు మాత్రం స్పాట్ విధుల నుంచి క్యాన్సిల్ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తిస్థాయిలో ఏఈలు లేకపోవడంతో బీసీ, సోషల్ వెల్ఫేర్ గురుకులాల అధికారులతో మాట్లాడి వాల్యుయేషన్‌కు టీచర్లను నియమించాలని డీఈవో, క్యాంప్ ఆఫీసర్ సోమశేఖరశర్మ కోరారు.
దీంతో వారు మంగళవారం రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నానికి చీఫ్ ఎగ్జామినర్లుగా 109మందికి 84 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా 648మందికి 496 మంది, స్పెషల్ అసిస్టెంట్లుగా 218మందికి 115 మంది పాల్గొననున్నారు. మూల్యాంకనం ప్రక్రియలో సహాయ ఎగ్జామినర్స్ ఎంత కీలకపాత్ర వహిస్తారో స్పెషల్ అసిస్టెంట్లు అదేస్థాయిలో కీలకపాత్ర వహిస్తారు. 250మందికి పైగా స్పెషల్ అసిస్టెంట్లకు విధులు కేటాయించగా 100మందికి పైగా గైర్హాజరైనట్లు తెలుస్తోంది. మూల్యాంకనం చేసేందుకు ఏఈలకు పేపర్లు ఇచ్చేందుకు ఎస్జీటీలను స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. వీరి గైర్హాజరుతో అవసరమైన మేర బీఈడీ కళాశాలల విద్యార్థులతో మంగళవారం నుంచి స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా కొందరు ఉపాధ్యాయులు తమ ఉత్తర్వుల క్యాన్సిలేషన్ కోసం పైరవీలు చేశారు. క్యాన్సిలేషన్‌కు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు 200 మంది ఉండగా అందులో అత్యధిక మంది ఆరోగ్యం బాగోలేదంటూ మెడికల్ సర్టిఫికెట్ పొందుపరిచారు.
జిల్లాకు 2,34,727 సమాధాన పత్రాలు స్పాట్‌కు చేరుకున్నాయి. రెగ్యులర్ వాటితోపాటు ఒకేషనల్ 1,340 పేపర్లు వచ్చాయి. ఏఈలు 152మంది, స్పెషల్ అసిస్టెంట్స్ 103మంది రిపోర్ట్ చేయలేదు. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. హాజరుకాని వారిపై చర్యలు తీసుకోనున్నట్లు క్యాంప్ ఆఫీసర్ సోమశేఖరశర్మ తెలిపారు. మూల్యాంకనం ప్రక్రియను పరిశీలించేందుకు అబ్జర్వర్‌గా మోడల్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాసచారిని నియమించారు.